సిటీబ్యూరో, సెప్టెంబర్ 6(నమస్తే తెలంగాణ) : గణనాథుల నిమజ్జనోత్సవంతో మెట్రోకు గిరాకీ పెరిగింది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి ట్యాంక్ బండ్ పరిసరాలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులతోపాటు మెట్రోనూ ఆశ్రయించారు. వీకెండ్ కావడంతో నగర శివారు ప్రాంతాల నుంచి లక్డీకాపూల్ చేరుకున్న ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇక నిమజ్జనం కోసం మెట్రో సంస్థ కూడా అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో రోజువారీ ప్రయాణికుల సంఖ్య 20 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. ముఖ్యంగా ఎల్బీనగర్, పటాన్చెరు, ఉప్పల్, రాయ్దుర్గం వంటి ప్రాంతాలకు కూడా ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఇండ్లకు చేరుకునే వీలు ఉండటంతో మెట్రోకు కలిసి వచ్చింది.
నిమజ్జనం జరుగుతున్న రెండ్రోజులు మాత్రం ప్రయాణికుల సంఖ్య 6 లక్షలకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. సాధారణ రోజుల్లోనే మెట్రో ప్రయాణికుల సంఖ్య 5-5.5 లక్షలకు చేరగా, మరో లక్ష మంది మెట్రోను ఆశ్రయిస్తారని మెట్రో సంస్థ అంచనా వేసింది. దీనికోసమే అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో సేవలు పొడిగించామని పేర్కొంది. నిజానికి ఆర్టీసీలో ఉచిత బస్సు సేవలు అందుబాటులో ఉన్నా మెట్రోలో ప్రయాణించేందుకు నగరవాసులు మొగ్గు చూపుతున్నారు.
ప్రధాన మార్గాల్లో శోభాయాత్రలతో నిలిచిపోయే ట్రాఫిక్ సమస్యల కంటే కొంత రద్దీ ఉన్నా… మెట్రో ద్వారా ప్రయాణించడమే మంచిదని మియాపూర్ నుంచి వచ్చిన రామ్మోహన్ వివరించారు. లక్డీకాపూల్ నుంచి సులభంగా మియాపూర్ వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జర్నీ చేసే వీలు ఉండటంతో సొంత వాహనం అక్కడే నిలిపేసినట్లుగా తెలిపారు. ఇలా నగరంలో ఆర్టీసీ బస్సులు, వ్యక్తిగత వాహనాల కంటే మెట్రోను ఆశ్రయించడంతో ప్రయాణికుల సంఖ్య పెరగనుంది.