సిటీబ్యూరో, జనవరి 5 (నమస్తే తెలంగాణ) : గాలిపటాలతో మెట్రో సేవలకు అంతరాయం కలుగుతుండటంతో హెచ్ఎంఆర్ఎల్ ఆందోళన చెందుతున్నది. సంక్రాంతి సందర్భంగా ఎగురవేసే గాలిపటాల దారాలు.. ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ వైర్లకు చుట్టుకుని విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిస్తుంది. గతంలో దీంతోనే చాలా సార్లు మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడిందని గుర్తించిన యంత్రాంగం.. ఈ పండుగ సందర్భంగా ప్రత్యేక ఆంక్షలకు సిద్ధమైంది.
మెట్రో స్టేషన్లు, మెట్రో కారిడార్ ప్రాంగణాలకు సమీపంలో గాలిపటాలను ఎగరవేయడానికి నిషేధించింది. కాగా, వందలాది గాలిపటాలతో సందడి చేసే కైట్ ఫెస్టివల్.. మెట్రోకు ప్రాణ సంకటంగా మారింది. రెండు ప్రధాన స్టేషన్లకు సమీపంలో పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే ఈ వేడుకకు విదేశాల నుంచి భారీ గాలిపటాలతో నిర్వాహకులు పాల్గొంటారు. అయితే మెట్రో ఆంక్షల నేపథ్యంతో కైట్ ఫెస్టివల్ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వందలాది గాలిపటాలను గాల్లోకి వచ్చే ఈ వేడుక పట్ల మెట్రో సంస్థ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. కాగా, కొత్తగా గాలిపటాలతో కలుగుతున్న ఇబ్బందులపై ఆంక్షలు విధించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.