మల్కాజిగిరి, జనవరి 4: శామీర్‌పేట్, మేడ్చల్ వైపు మెట్రోను విస్తరించాలని అసెంబ్లీలో సమావేశాలలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతోనే మెట్రో రైల్ పట్టాలెక్కనుందని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. బోయిన్‌పల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మెట్రో రైల్ విస్తరణకు కృషి చేసిన ఎమ్మెల్యేతో స్థానిక నాయకులు శనివారం కలిసి కేక్ కట్‌చేసి పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మెట్రో రైల్ ‘ప్యారడైజ్ నుంచి మేడ్చల్’ వరకు 23 కిలో మీటర్లు, ‘జూబ్లీ బస్ స్టేషన్ నుంచి శామీర్‌పేట’ వరకు 22 కిలో మీటర్లు రెండు వైపులా 45కిలో మీటర్లు మెట్రో రైల్‌ను విస్తరించాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మెట్రో రైల్ ప్రాజెక్ట్ కోసం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. ఉత్తర తెలంగాణ నుంచి వచ్చే వారితో పాటు నగరవాసులకు ఉపయోగంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం మెట్రో రైల్‌కు ఆమోదం తెలపడంతో పాటు ఫేస్-2 పార్ట్-బీ ప్రథమ ప్రాధాన్యతా క్రమంలో మొదలు పెట్టాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, నరేందర్ రెడ్డి, రహ్మత్‌ఖాన్, మహమ్మద్ గౌస్, ఆరిఫ్, శరణ్‌గిరి, సందీప్, యాదగిరి గౌడ్, సతీశ్, లోకేశ్, సాజిద్, లింగారెడ్డి, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.