సిటీబ్యూరో, జూన్ 13 (నమస్తే తెలంగాణ) : వర్షాకాలం నేపథ్యంలో మెట్రో సేవలకు అంతరాయం లేకుండా సాగించేందుకు ముందస్తు కార్యాచరణలో భాగంగా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి నిర్వహించారు. గురువారం మెట్రో భవన్లో ఎల్అండ్టీ ఎండీ కేవీబీ రెడ్డి, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కంపెనీ కియోలిస్, హెచ్ఎంఆర్ఎల్, ఇండిపెండెంట్ ఇంజినీరింగ్ సంస్థ అధికారులతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. వర్షాకాలంలో మెట్రో రైలు సేవలను నిరంతరాయంగా నడపడం, ప్రయాణికుల భద్రత, సౌలభ్యం వంటి అంశాలపై చర్చించారు.
వర్షాకాలం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, మెట్రో రైలు కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించాలని ఉన్నతాధికారులు అధికారులకు సూచించారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల సమయంలో రైలు సేవలకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా జరిగేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, అన్ని విస్తరణ జాయింట్లను క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. అదేవిధంగా రెయిన్ వాటర్ స్పాట్లను శుభ్రం చేయాలని, రెయిన్ వాటర్ గట్టర్ లీకేజీల నివారణ, మొక్కల తొలగింపు, ప్లాట్‌ఫారంపై వర్షం నీటిని తక్షణమే తొలగించేలా సిబ్బంది సర్దుబాట్లపై చర్చించారు.
అదేవిధంగా ప్రకటనల బోర్డులు, ఫ్లెక్సీలను తొలగించాలని, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్ పనులు, స్టేషన్ రూఫ్ షీట్లు పడిపోకుండా చూడాలన్నారు. మెట్రో పాయింట్లు, లిఫ్టులు, ఎస్కలేటర్ల వద్ద ముంపు నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. రైలు ట్రాక్, సున్నితమైన ఉక్కు నిర్మాణాలపై పేరుకున్న తుప్పు తొలగించాలన్నారు. అదేవిధంగా మెట్రో ప్రయాణికులకు తక్షణమే సమాచారం చేరవేసేలా అవగాహన కల్పించాలన్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన మెట్రో ప్రమాదాలపై కూడా చర్చించగా.. డోర్ల మధ్య ఇరుకుపోయిన ఘటనలపై ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలన్నారు. రైలు ఎక్కి, దిగేటప్పుడు, ఎస్కలేటర్‌పై ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని ప్రయాణికులకు సూచించారు. వర్షాకాలం భద్రత చర్యల్లో భాగంగా మెట్రో సేవలకు అంతరాయం లేకుండా చూడాలన్నారు.