సిటీబ్యూరో, మే 12 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలోనే అతి పెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ ప్రాజెక్టు. ఎంతో దూర దృష్టితోనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)కు రూపకల్పన. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని అందుబాటులోకి.. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ముందుగా రూపొందించుకున్న ప్రణాళిక ప్రకారం.. ప్రాజెక్టు పూర్తయి అందుబాటులోకి వచ్చిన ఐదేండ్ల తర్వాత లాభాలు వస్తాయనుకుంటే, అంచనాలను తలకిందులు చేస్తూ నష్టాలను మూటకట్టుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఫ్రీ బస్సు ప్రయాణం పేరుతో ప్రారంభించిన మహాలక్ష్మి పథకం..మెట్రో రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్యపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉచిత బస్సు పథకాన్ని ఐదేండ్ల పాటు అమలు చేస్తే..మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్యలో పెరుగుదల ఆశించిన స్థాయిలో ఉండదని అధికారులు అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయాన్ని మూడు మార్గాల్లో రాబట్టుకోవాలని పక్కా ప్రణాళికతో సుమారు రూ.16వేల కోట్లను ఎల్ అండ్ టీ మెట్రో రైలు హైదరాబాద్ సంస్థ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. 66 కిలోమీటర్ల పరిధిలో మూడు కారిడార్లలో మెట్రో రైళ్ల రాకపోకలు సాగిస్తున్నాయి. టికెటింగ్‌తో 50 శాతం, రియల్ ఎస్టేట్ కార్యకలాపాల ద్వారా 45 శాతం, వ్యాపార ప్రకటనలు ద్వారా ఆదాయం పొందాలని ఎల్ అండ్ టీ మెట్రో సంస్థ అంచనాలు వేసుకున్నది. ఐదేండ్ల తర్వాత మెట్రో రైళ్లలో ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరిగి.. ఆ తర్వాత నుంచి లాభాలు వచ్చేందుకు అవకాశం ఉంటుందని వేసుకున్న అంచనాలు ఇప్పుడు తారుమారయ్యాయి. మెట్రో సేవలు ప్రారంభమై.. ఆరేండ్లు పూర్తయ్యే నాటికి మెట్రో ప్రయాణికుల సంఖ్య ఒక్కసారిగా 5 లక్షల నుంచి 5.5 లక్షల దాకా పెరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంచనాలు తలకిందులయ్యాయి.
హైదరాబాద్ మెట్రో రైలు రైడర్‌షిప్ ఆరేండ్లు పూర్తయ్యే నాటికి దాదాపు 5 లక్షలకు చేరుకుంది. కారిడార్-1( ఎల్బీనగర్-మియాపూర్) మార్గంలో రోజుకు దాదాపు 2.45 లక్షలు, కారిడార్-3 (నాగోల్-రాయదుర్గం)లో 2.30 లక్షల మంది, కారిడార్-2 (జేబీఎస్-ఎంజీబీఎస్) మార్గంలో 35 వేల మంది ప్రయాణం చేస్తున్నారు. గతేడాది నవంబర్ 2023 నాటికి.. హైదరాబాద్ మెట్రో రైలులో రోజువారీ ప్రయాణికుల సంఖ్య 5 లక్షల నుంచి 5.5 లక్షల మంది గరిష్ఠ స్థాయికి చేరుకుంది. అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన డిసెంబర్ 7 తర్వాత నుంచి మహిళలకు అమలు చేసిన ఉచిత ఆర్టీసీ ప్రయాణం పథకంతో మెట్రోలో రోజువారీ ప్రయాణికుల సంఖ్య సుమారు 4.80 లక్షలకు పడిపోయింది.
మెట్రో రైలు ప్రాజెక్టులో రియల్ ఎస్టేట్ అంశం అత్యంత కీలకమైంది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రవాణా ఆధారిత అభివృద్ధి కేంద్రాలు మెట్రోమాల్స్, మెట్రో స్టేషన్లలోని వ్యాపార సంస్థలకు అద్దెకు ఇచ్చే స్థలాలు. ఇతర ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూముల ద్వారా 45 శాతం ఆదాయం రావాల్సి ఉంది. ప్రాజెక్టులో భాగంగా మొత్తం 4 మాల్స్‌ను నిర్మించారు. వీటి నుంచి ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోవడంతో అన్ని మాల్స్‌ను ఒకేసారి దీర్ఘకాలిక లీజుకు ఇవ్వడం ద్వారా పెద్ద మొత్తంలో నిధులను సమకూర్చుకునేందుకు ఎల్ అండ్ టీ సిద్ధమైంది.
ఇక మూడు కారిడార్లలో నిర్మించిన 59 మెట్రో స్టేషన్లలో వ్యాపార సంస్థలకు లీజుకు ఇచ్చేందుకు వీలుగా నిర్మించిన స్థలాల్లో సింహ భాగం ఖాళీగానే ఉంది. కేవలం మియాపూర్, ఎల్బీనగర్, రాయదుర్గంలతో పాటు అమీర్‌పేట, ఎంజీబీఎఎస్, పరేడ్‌గ్రౌండ్-జేబీఎస్ మెట్రో స్టేషన్లలోనే వ్యాపార సంస్థల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. మిగతా స్టేషన్లలో 90 శాతం స్థలాలు ఖాళీగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఐదేండ్ల పాటు ఫ్రీ బస్సు పథకాన్ని అమలు చేస్తే..మెట్రో ప్రయాణికుల సంఖ్య ఆశించిన స్థాయిలో పెరగదనే అంచనాకు వచ్చిన ఎల్ అండ్ టీ సంస్థ..2026 నాటికి ప్రాజెక్టు మొత్తాన్నే విక్రయించాలన్న ఆలోచన చేస్తోంది. ఇదే విషయాన్ని ఆ సంస్థ ప్రతినిధి ఇటీవల ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.