మారేడ్‌పల్లి, అక్టోబర్ 17: సికింద్రాబాద్‌లోని కుమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయం ధ్వంసం కేసులో.. ప్రధాన నిందితుడు సలీం బస చేసిన రెజిమెంటల్‌బజార్‌లోని మెట్రో పోలీస్ హోటల్‌ను గురువారం రెవెన్యూ, పోలీసు అధికారులు సీజ్ చేశారు. అంతకుముందు సికింద్రాబాద్ తహసీల్దార్ పాండు నాయక్, డిప్యూటీ తహసీల్దార్ రజని, గోపాలపురం ఇన్స్పెక్టర్ నరేశ్ ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీసులు అధికారులు, సిబ్బంది హోటల్లో ఉన్న పలువురిని ఖాళీ చేయించి బయటకు పంపించారు.
ఎలాంటి అనుమతులు లేకుండా మెట్రో పోలీస్ హోటల్లో పలువురు యువతకు ఇంగ్లిష్ వ్యక్తిత్వ వికాస శిక్షణ, స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ పేరుతో అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహించే విధంగా శిక్షణ ఇచ్చిన నేపథ్యంలో హోటల్‌ను సీజ్ చేసినట్లు సికింద్రాబాద్ తహసీల్దార్ తెలిపారు. నెల రోజుల నుంచి పోలీసు శాఖ నుంచి అనుమతులు లేకుండా సమావేశాలు జరిపారని.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 5 అంతస్తుల భవనంతో పాటు గ్రౌండ్ ఫ్లోర్‌ను సీజ్ చేసినట్లు వెల్లడించారు. మోటివేషనల్ స్పీకర్ మునావర్ జమాతో పాటు హోటల్ యజమాని, మేనేజర్లపై కేసు నమోదు చేసినట్లు గోపాలపురం ఇన్స్పెక్టర్ నరేశ్ వెల్లడించారు.