‘మేము చేస్తున్న ఆందోళన సీఎం రేవంత్రెడ్డి దాకా పోవాలే.. మా సమస్యకు పరిష్కారం కావాలే… పార్కింగ్ చార్జీలను ఇష్టారాజ్యంగా పెంచుతారా? ఇది ప్రభుత్వ స్థలం.. అందులో పార్కింగ్ ఫీజులు వసూలు చేయడం దారుణమైన నిర్ణయం.. ఎల్అండ్టీ డౌన్…డౌన్.. వీ వాంట్ జస్టిస్… అంటూ ’ నాగోల్ మెట్రో స్టేషన్లో ప్రయాణికులంతా బుధవారం ఉదయం ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. ఇప్పటికే మెట్రో చార్జీలు ఎక్కువగా ఉన్నాయంటూ.. పెయిడ్ పార్కింగ్ నిర్ణయాన్ని తప్పుపట్టారు.
-సిటీబ్యూరో, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ)
ఉప్పల్ మెట్రో డిపో పక్కన ఇప్పటి వరకు ఉచిత పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించిన ఎల్ అండ్ టీ మెట్రో అధికారులు.. ఒక్కసారిగా పెయిడ్ పార్కింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీంతో నాగోల్ స్టేషన్లో వందలాంది మంది ప్రయాణికులు పెద్ద ఎత్తున నినాదాలతో ఆందోళనకు దిగారు. లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేకపోవడం వల్ల ఇంటి నుంచి మెట్రో స్టేషన్ వరకు తమ సొంత వాహనాల్లోనే వస్తున్నారు. ఈ కారణంగానే టర్మినల్ స్టేషన్లు అయిన నాగోల్, మియాపూర్, ఎల్బీనగర్, రాయదుర్గం, పరేడ్ గ్రౌండ్ వంటి ప్రాంతాల్లో వేలాది వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పెయిడ్ పార్కింగ్ విధానాన్ని తీసుకురావడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు.
హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టులోని నాగోల్,మియాపూర్ మెట్రో డిపో ప్రాంతాల్లో ఉన్న పార్కింగ్ స్థలాల్లో పెయిడ్ పార్కింగ్ విధానాన్ని అమలు చేస్తున్నామని ఎల్ అండ్ టీ మెట్రో అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 25 నుంచి నాగోల్ పార్కింగ్ లాట్లో, అదేవిధంగా సెప్టెంబర్ 1 నుంచి మియాపూర్ మెట్రో పార్కింగ్ లాట్లో పెయిడ్ పార్కింగ్ సేవలను అమలు చేస్తామని వెల్లడించారు.
మెట్రో స్టేషన్లో కారు పెట్టి ఐటీ కారిడార్లోని ఆఫీసుకు వెళ్లి తిరిగి వచ్చే సరికి 9 గంటలకు పైగా సమయం పడుతుంది. దీంతో కారు పార్కింగ్ 8 గంటలు దాటింది.. కాబట్టి ఫీజు రూ.120.00లు చెల్లించాలి. అదే సమయంలో మెట్రో రైలులో ప్రయాణం చేసినందుకు మరో రూ. 50-60ల దాకా ఖర్చవుతుంది. అక్కడి నుంచి ర్యాపిడో వాహనంలో ఆఫీసు వరకు వెళితే రూ.30-40లు అవుతాయి. ఇలా కారులో వచ్చే మెట్రో ప్రయాణికుడి ఖర్చు రూ.200లు అవుతుంది. ఇంత భారాన్ని మేము మోసేదెలా అంటూ మెట్రో అధికారులతో ఓ ప్రయాణికుడు వాగ్వాదానికి దిగాడు.
పార్కింగ్ లాట్లో చాలా మౌలిక వసతులు కల్పిస్తున్నామని మెట్రో అధికారులు పేర్కొం టున్నారు. అయితే వాహనాలు దొంగతనానికి గురైనా, పాడైనా, డ్యామేజ్ అయినా, వాహనాల విడి భాగాలు దెబ్బతిన్నా.. మాది బాధ్యత కాదంటూ.. బోర్డు ఏర్పాటు చేయడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు.