కంటోన్మెంట్, అక్టోబర్ 12ః గత ఏడెనిమిదేళ్లుగా జింఖానా మైదానంలో బాణాసంచా దుకాణాల ఏర్పాటుకు అనుమతులివ్వని కంటోన్మెంట్ బోర్డు ఈ సారి ఆదాయం కోసం అనుమతులు ఇచ్చేందుకు ఆన్లైన్ టెండర్లను ఆహ్వానించింది. జింఖానా మైదానంలో ఏర్పాటు చేసే బాణాసంచా దుకాణాల ఏర్పాటు విషయంలో బోర్డు కనీసం భద్రతాను పట్టించుకోకపోవడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఓ పక్క మెట్రో స్టేషన్, మరో పక్క జింఖానా క్రీడా మైదానం, మైదానం వెనుక వైపు పెట్రోల్ పంపు ఉంది.
ఈ విషయాలు పరిగణలోకి తీసుకోకుండా కేవలం ఆదాయం కోసమే అధికారులు బాణాసంచా దుకాణాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. పనిలో పనిగా ఏదైనా జరిగితే తమ మెడకు చుట్టుకోకుండా పోలీస్, ఫైర్ డిపార్ట్మెంట్లు అనుమతులిస్తే ఇవి కొనసాగుతాయని ప్రోవిజినల్ పర్మిషన్తో తాత్కాలిక షెడ్లు వేసుకుని బాణాసంచా దుకాణాలు ఏర్పాటు చేసి టపాసులు విక్రయించేందుకు అనుమతులు ఇస్తున్నట్లు ఈ నెల ఏడో తేదీన నోటిఫికేషన్ జారీ చేశారు.
భద్రతా నిబంధనలు తూచ్
ఎక్స్‌ప్లోజీవ్ యాక్ట్ 1884, 2008లకు పలు సవరణలు చేస్తూ ఈసారి ప్రభుత్వం పలు నిబంధలు విధించింది. దీపావళి పర్వదినం సందర్భంగా ఖాళీ స్థలంలో బాణాసంచా అమ్మడానికి దుకాణాలు ఏర్పాటు చేయాలి. 86(3) ప్రకారం విక్రయాలు జరిపేందుకు ఏర్పాటు చేసే దుకాణాల మధ్య కనీసం మూడు మీటర్లు ఖాళీ స్థలం ఉండాలి. ప్రభుత్వ ఆస్తులకు కనీసం 50 మీటర్ల దూరంలో ఏర్పాటు చేయాలి. బాణాసంచా విక్రయాల సందర్భంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఏర్పాట్లు చేయాలి. బాణాసంచా దుకాణం ప్రారంభించే ముందు పోలీస్, అగ్నిమాపక విభాగాల అనుమతులు కోరుతూ లైసెన్స్ కోసం దరఖాస్తు చేయాలి.
లైసెన్స్‌లో అనుమతించిన పరిమాణంలో మాత్రమే బాణాసంచా నిల్వ చేయాలి. అగ్నిప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను పాటించాలి. దుకాణాల్లో వాటర్ స్ప్రింక్లర్ సిస్టమ్, గ్రావిటీ ఫీడ్ కోసం 2హెచ్‌పీ పంప్స్ ఏర్పాటు చేయాలి. ఈ నిబంధనలు పరిశీలించిన అనంతరం పోలీసు, ఫైర్ విభాగం అనుమతులు ఇవ్వాలి, కాని కంటోన్మెంట్ బోర్డు అధికారులు ఆన్లైన్ టెండర్లు ఆహ్వానించడంతో బాణాసంచా వ్యాపారస్థులు ఈ టెండర్లో పాల్గొని ఏడు షాపులను దక్కించుకున్నారు. పోలీసు, ఫైర్ అనుమతులు రాకుండానే షాపుల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. ఈ విషయమై కంటోన్మెంట్ బోర్డు అధికారులు నోరు మెదపకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసుల అనుమతి తీసుకోలేదు
జింఖానా మైదానంలో బాణాసంచా దుకాణాల ఏర్పాటు విషయమై బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణమూర్తిని వివరణ కోరగా ఇప్పటివరకు ఒక్క దరఖాస్తు కూడా తమ వద్దకు రాలేదని చెప్పారు. దరఖాస్తు వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో పరిశీలించి అనుమతులు ఇవ్వాలా వద్దా? అనేది నిర్ణయిస్తామని తెలిపారు. కాగా కంటోన్మెంట్ బోర్డు రెవెన్యూ విభాగం సూపరింటెండెంట్ తజముల్లాను వివరణ కోరగా వ్యాపారులు ఆన్లైన్ టెండర్లల్లో పాల్గొని ఏడు దుకాణాలు దక్కించుకున్నారని, ఒకవేళ పోలీసులు అనుమతి ఇవ్వని పక్షంలో, వాటిని రద్దు చేస్తామని తెలిపారు.