Hyderabad Metro | సిటీబ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ) : మెట్రో చార్జీలను పెంచాలి.. నష్టాలను భర్తీ చేసుకోవాలి.. అని అనుకున్న ఎల్అండ్టీ వ్యూహం బెడిసికొట్టింది. ప్రయాణికులపై పడనున్న భారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన ఒత్తిడికి మెట్రో నిర్వహణ సంస్థ తలొగ్గింది. అనుకున్నట్లుగా పునరాలోచన చేస్తున్నట్లుగానే పెరిగిన ధరల్లో 10 శాతం రాయితీ ప్రకటించింది. రూ. 2 నుంచి రూ. 15 పెంచింది కానీ కొత్తగా సవరించిన ధరల్లో 10శాతం రాయితీ ఇస్తున్నట్లుగా ఈ మేరకు ఎల్ అండ్ టీ ఎండీ కేవీబీ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
మే 24 నుంచి అమలులోకి తగ్గిన చార్జీలు అమలులోకి వచ్చేంత వరకు ప్రయాణికులపై పడే భారం ఎంతనేది అస్పష్టంగానే ఉంది.ఆధునిక రవాణా సదుపాయం పేరిట హైదరాబాద్ నగరవాసులపై మెట్రో నిర్వహణ సంస్థ చార్జీలను పెంచి భారం మోపింది. ఒకేసారి 20 శాతం ధరలను పెంచిన ఆ సంస్థ.. ప్రజల ఒత్తిడికి వెనకడుగు వేసినట్లుగా రాయితీలతో సద్దుమణిగేలా చర్యలు తీసుకుంది. ఈ నెల 17 నుంచి పెంచిన ధరలు అమలులోకి రావడంతో కనిష్ఠంగా రూ. 2, గరిష్ఠంగా రూ. 15 భారం పడింది. దీనిపై సామాన్య మెట్రో ప్రయాణికులతోపాటు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా పెంచిన చార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు.
లేదంటే పెద్ద ఎత్తున్న మెట్రో ముట్టడి, ఆందోళనలకు పిలుపునివ్వగా.. లోపభూయిష్టంగానే ఉన్న చార్జీల సవరణ ప్రతిపాదనలపై కాంగ్రెస్ సర్కారు కూడా వెనకడుగు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ మేరకు సవరించిన కొత్త చార్జీలపై 10శాతం రాయితీ ఇస్తున్నట్లుగా ప్రకటించి పొంగు మీద నీళ్లు చల్లే ప్రయత్నం అయితే చేసింది. దీనికి తగినట్లుగానే ఎల్అండ్టీ విడుదల చేసిన పత్రిక ప్రకటన కూడా సందేహాంతోనే ఉండటంతో అసలు పెంచింది ఎంత..? రాయితీ ఇచ్చింది ఎంత? రాయితీ పోనూ వాస్తవ ధర ఎంతనేది ఇప్పుడు కొత్త ధరలు అమలులోకి వచ్చేంత వరకు తెలిసేలా లేదు.
10 శాతంలోనే గందరగోళం..
కొత్తగా సవరించిన చార్జీలలో 10శాతం రాయితీ ఇస్తున్నట్లుగా ఎల్అండ్టీ చేయగా.. సవరించిన ధరల ప్రకారం.. మియాపూర్‌లో మెట్రో ఎక్కిన వ్యక్తి జేఎన్టీయూ వద్ద దిగితే రూ. 12 చార్జీ అవుతుంది. ఇందులో 10 శాతం రాయితీ అంటే రూ. 1.2 పోనూ మిగిలినది రూ. 10.80 అవుతుంది. అదే విధంగా ఎల్బీ నగర్లో ఎక్కిన వ్యక్తి ఖైరతాబాద్, లక్డీకాపూల్‌లో దిగితే రూ. 55 చెల్లిస్తున్నాడు. మే 24 తర్వాత ఇచ్చే 10శాతం రాయితీ తర్వాత ప్రస్తుత టికెట్ ధర రూ. 49.5 మారుతుందా? లేక గరిష్టంగా పెంచిన రూ. 15లో 10శాతం రాయితీ ఇస్తారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్..
నిజానికి ధరలు పెంచాలనే ప్రతిపాదనను 2023లోనే చేశామంటూ చెప్పుకొచ్చిన ఎల్ అండ్ టీ.. ఆ సమయంలోనే మెట్రో చార్జీలను పెంచేందుకు బీఆర్ఎస్ ఆమోదించలేదు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే ఈ నిర్ణయం అమలులోకి తీసుకొచ్చింది. అయితే ధరల పెంపుపై ఎలాంటి కసరత్తు చేయకుండా… కేవలం జనాలపై భారం మోపేలా ధరలు నిర్ణయించడంతో.. బీఆర్ఎస్ ఒత్తిడి పెంచింది. దీనిపై తీవ్రంగానే స్పందించిన నగర ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా పెంచిన చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేసింది. దీంతో దిగొచ్చిన సర్కారు.. ప్రజా వ్యతిరేకత పెరగక ముందే దిద్దుబాటు చర్యలకు దిగింది.