సిటీబ్యూరో, మే 25(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రో స్టేషన్లు ప్రచార కేంద్రాలుగా మారిపోయాయి. మిస్ వరల్డ్ పోటీలకు విస్తృత స్థాయిలో ప్రచారం కల్పిస్తూ స్టేషన్లు, ప్రాంగణాలు, మార్గాలను ఫ్లెక్సీలతో నింపివేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో జరుగుతున్న తొలి కార్యక్రమం కావడంతో… అందాల పోటీలపై ప్రచార స్థాయిని పెంచుతూ ఏర్పాట్లు చేసినట్లు మెట్రో సంస్థ వెల్లడించింది.
ఈ మేరకు మెట్రో మెట్ల ముఖ ద్వారాల వెంబడి తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ, బోనాలతోపాటు, తెలంగాణలోని ఆధ్యాత్మిక కేంద్రాలు, వాణిజ్య కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలతో కూడిన ఫ్లెక్సీలను నాగోల్ నుంచి హైటెక్ సిటీ వరకు, ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకు అన్ని మార్గాల్లో ఇరువైపులా ఏర్పాటు చేశారు.