నగర మెట్రో ప్రయాణికుల పాలిట ప్రాణసంకటంలా మారింది. చిరు జల్లులకు కూడా ఒక్కసారిగా నిలిచిపోతున్నది. దీంతో వర్షాకాలం సీజన్ ప్రయాణికులకు శాపంగా మారింది. నిర్వహణలోపంతో తరచూ వస్తున్న సాంకేతిక సమస్యలపై దృష్టి పెట్టాల్సిన నిర్వహణ సంస్థ… నిర్లక్ష్యం చేస్తుండటంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కురుస్తున్న జోరు వానలతో ప్రయాణికులు అనివార్యంగానే మెట్రోను ఆశ్రయిస్తున్నారు. కానీ ఎప్పుడూ ఆగిపోతుందో తెలియకపోవడంతో భారీ వర్షాల సమయంలో మెట్రో నిలిచిపోతే తమ పరిస్థితి ఏమిటనీ నిత్యం కంగారుపడుతున్నారు.
సిటీబ్యూరో, సెప్టెంబర్25 (నమస్తే తెలంగాణ): నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న జోరు వానలతో మెట్రో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్నది. మంగళవారం భరత్‌నగర్ మెట్రో స్టేషన్ సమీపంలో దాదాపు 10 నిమిషాలు ఆగిపోయింది. విద్యుత్ సరఫరా, సెన్సార్లలో వస్తున్న చిన్న చిన్న సమస్యలతో మెట్రో తరచూ ఆగిపోతున్నా.. భారీ వర్షాల సమయంలో నిర్వహణపై దృష్టి పెట్టడం లేదు. దీంతో వానకాలంలో ప్రయాణికులకు భయంభయంగానే మెట్రోను ఆశ్రయించాల్సి వస్తుందని చెబుతున్నారు. గడిచిన ఏడాదిన్నర కాలంగా నగరంలో మెట్రో నిర్వహణ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మెట్రో ఆగిన 15-30 నిమిషాల పాటు సేవలకు అంతరాయం ఏర్పడితే గానీ ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరే పరిస్థితి లేదు. అయితే ప్రత్యామ్నాయ మార్గాల్లో రవాణా సదుపాయాలు లేకపోవడంతో భారీ వర్షాల సమయంలో తప్పనిసరిగా మెట్రోను ఆశ్రయిస్తున్నామని, రోడ్లపై నిలిచిపోయే ట్రాఫిక్ కంటే మెట్రోతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నా… నిర్వహణ లోపంతో జరుగుతున్న బ్రేక్ డౌన్లు.. ప్రయాణికులను అసౌకర్యానికి గురిచేస్తోంది. ఓవైపు వర్షాలు, మరోవైపు ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉండటంతో నిత్యం గమ్యస్థానాలకు చేరేందుకు శ్రమించాల్సి వస్తుందని ప్రయాణికులు వాపోతున్నారు.