సిటీ బ్యూరో, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): వేతనాలు సకాలంలో అందకపోవడంతో హైదరాబాద్ మెట్రో రైలు భవన్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2 వేలకు పైగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, డిప్యూటేషన్‌పై వచ్చిన ఉద్యోగులు జీతాలు ఆలస్యమవ్వడంతో అవస్థలు పడుతున్నారు. ఈ సమస్య ప్రతి రెండు, మూడు నెలలకొకసారి పునరావృతమవుతున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీతాలు అందకపోవడంతో కుటుంబ ఖర్చులు, ఇంటి అద్దె, రవాణా ఖర్చులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వాపోతున్నారు. వేతనాలు ఆలస్యమైన ప్రతిసారీ ఇతరుల దగ్గర అప్పులు చేయాల్సిన దుస్థితి వస్తున్నదని ఆవేదన చెందుతున్నారు. ఏడాదిలో ఒకటి, రెండు సార్లు అయితే ఏదో ఒకరకంగా సర్దుకునేవారమని, కానీ ప్రతి రెండు, మూడు నెలలకోసారి ఇదే పరిస్థితి వస్తుంటే జీవనం కష్టంగా మారుతున్నదని వాపోతున్నారు. అధికారులు మాత్రం ఈ సమస్య తాత్కాలికమని, త్వరలోనే జీతాలు ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తామంటున్నారు.