సిటీబ్యూరో : ఎట్టకేలకు హైదరాబాద్ మెట్రో కోసం ప్రత్యేక యాప్‌ను డిజైన్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇన్నాళ్లు మెట్రో కార్డు ద్వారా రాయితీలతో కూడిన రవాణా సౌకర్యం కల్పించగా… ఫిజికల్ కార్డు వెంట పెట్టుకుని తిరగాల్సి వచ్చేది. ఒకవేళ కార్డు డ్యామేజీ జరిగినా.. మరిచిపోయినా కచ్చితంగా టికెట్ కొనాల్సిన పరిస్థితి ఉండేది. ఇలాంటి ఇబ్బందుల నేపథ్యంలోనే ఫిజికల్ కార్డుతో పనిలేకుండా, మరింత సులభంగా మెట్రో యాక్సెస్ చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కొంతకాలంగా వినియోగదారులు కోరుతున్నారు. ఈ మేరకు మెట్రో టెక్నికల్ విభాగం ఆ దిశగా అడుగులు వేస్తున్నది. ప్రస్తుతం ఢిల్లీ మెట్రో తరహాలో యాప్ బేస్డ్ విధానం అమల్లో ఉండగా… అదే తరహాలో ప్రస్తుతం ఉన్న టీ సవారీ యాప్ కంటే అధునాతన ఫీచర్లను జోడించనున్నారు. ఈ క్రమంలో కార్డుతో సంబంధం లేకుండా నేరుగా రాకపోకలు చేసుకునేలా తీర్చిదిద్దనున్నారు. ఏటీఎం కార్డు లేకున్నా… మొబైల్ యాప్‌లోని డబ్బు చెల్లింపులు జరుగుతున్నట్లుగానే అదే విధానాన్ని మెట్రో మొబైల్ యాప్‌లోనూ వినియోగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా కార్డు రీచార్జ్ కూడా సులభంగా చేసుకునేలా ఫీచర్లతో కొత్త మెట్రో మొబైల్ యాప్ ఉంటుందని, దీనికి సంబంధించిన అధ్యయనం పూర్తయినట్లు తెలిసింది.
వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చి నెల్లో ఈ యాప్ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు హెచ్ఎంఆర్ఎల్ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ మెట్రో రూపొందించిన యాప్ డిజైన్లతో పాటు, ఇతర యాప్‌లను అధ్యయనం చేసి.. నగర మెట్రో వాసులకు అధునాతన సేవలను అందించనున్నారు. హైదరాబాద్ మెట్రోకు క్రమంగా ఆదరణ పెరుగుతున్నది. నిత్యం 4.5 లక్షల నుంచి 5 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మెట్రో ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను అందుబాటులోకి తీసుకువస్తామని మెట్రో వర్గాలు చెబుతున్నాయి.