ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 7 : సంస్కృత భాషా ప్రభావం లేని భారతీయ భాష లేదంటే అతిశయోక్తి కాదు. రామాయణ, భారత, భాగవతాదులతో పా టు పురాణాలు, వేదా లు, ఉపనిషత్తులు తరువాత వచ్చిన లౌకిక సాహిత్యం కూడా భారతీయ భాషలన్నింటిలోకి అనువదించబడ్డాయంటే సంస్కృత వైశిష్ట్యం స్పష్టమౌతున్నది అటువంటి సంస్కృత భాషకు చిరునామాగా ఉస్మానియా యూనివర్సిటీలోని సంస్కృత అకాడమీ నిలుస్తున్నది. భాషా ప్రచారానికి, పరిశోధనలకు, అమూల్యమైన గ్రంథాల ముద్రణకు మారుపేరైన సంస్కృత అకాడమీ దేశంలో ప్రసిద్ధి పొందిన ప్రధానమైన సంస్కృత పరిశోధనా సంస్థలలో అగ్రగామిగా మన్ననలను పొందుతున్నది.
ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీలో సంస్కృత పరిశోధనే ప్రధాన ధ్యేయంగా ఇప్పటి ఆర్ట్స్ కళాశాల భవనంలోనే 1954 జూలై 21న సంస్కృత అకాడమీని ప్రారంభించారు. నాటి నుంచి సంస్కృత పరిశోధనా రంగంలో విశిష్టమైన స్థానాన్ని సంస్థ సంపాదించుకుంది.
ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ల ప్రోత్సాహం, అకాడమీ డైరెక్టర్ల ఆసక్తితో సంస్కృత భాషా, సాహిత్యరంగాలలో ఎనలేని సేవలందిస్తున్నది. అకాడమీ నిధుల లేమితో క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వెలకట్టలేని ఎన్నో సంస్కృత శాస్త్రగ్రంథాలను పద్మశ్రీ ప్రొఫెసర్ పుల్లెల శ్రీరామచంద్రుడు పరిశోధించి, ముద్రించి, అకాడమీని ఉన్నతమైన స్థానానికి తీసుకువచ్చారు. కాగా, ప్రతి ఏటా పుస్తక ప్రచురణ, అకాడమీ అభివృద్ధికి ఓయూ రూ.లక్ష సమకూరుస్తున్నది.
ఓయూ మెయిన్ లైబ్రరీలోని 2,600 మనుస్క్రిప్ట్లను పరిశోధించి, ఆల్ఫాబెట్ క్రమంలో ఐదు వందల పేజీలతో కేటలాగ్‌ను అకాడమీ ముద్రించింది. ఈ గ్రంథం దేశ విదేశాల్లోని సంస్కృత పరిశోధకులు, పండితులకు ఎంతగానో ఉపయోగపడింది. ఇంతేకాకుండా 1964 నుంచి వివిధ శాస్ర్తాలకు చెందిన 125 గ్రంథాలను అకాడమీ ప్రచురించింది.
సంస్కృత అకాడమీలో వివిధ శాస్ర్తాలకు చెందిన విలువైన 130 మనుస్క్రిప్ట్లు భద్రపరిచారు. వాటిలో సమాజానికి ఉపకరించే వాటిని పరిశోధించి, ప్రచురించేందుకు అవిరళ కృషి కొనసాగుతున్నది. అకాడమీ లైబ్రరీలో సుమారు పదకొండు వేల పుస్తకాలు ఉన్నాయి.
సంస్కృత ప్రచారం కోసం, సంస్కృతాన్ని సామాన్యజనంలోకి తీసుకువెళ్లేందుకు అకాడమీ ఆధ్వర్యంలో రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగానే డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులను రూపొందించారు. గతేడాది నుంచి ఆన్లైన్ ద్వారా సైతం సంస్కృతం భాషను నేర్పుతున్నారు.
కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం అమలు చేస్తున్న అష్టాదశీ పథకం ద్వారా సంస్కృత అకాడమీ ఇప్పటి వరకు ఐదు ప్రాజెక్టులు దక్కించుకుంది. మనుస్క్రిప్టుల ప్రచురణ, అరుదైన ప్రాచీన సంస్కృత గ్రంథాల పునర్ముద్రణ, ఆయుర్వేదం ద్వారా సంస్కృతం, నెలరోజుల వేసవి సంస్కృత శిక్షణా శిబిరం నిర్వహణ, తెలుగు లిపిలో ముద్రించబడిన సంస్కృత గ్రంథాలను దేవనాగిరి లిపిలో ముద్రించడం తదితర ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను సొంతం చేసుకుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా ల సహకారంతో సంస్కృ త భాషకు పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. పరిశోధన, ప్రచురణతో పాటు సంవత్సరం పొడుగునా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ర్టాల నుంచి విద్యార్థులు, పండితులను ఆహ్వానించి సాహిత్య కార్యక్రమాలు చేపడుతున్నాం. సంస్కృతం భాషను సామాన్యలకు చేరువచేస్తే అద్భుత ఫలితాలు సాధించవచ్చు.