Skywalk | సిటీబ్యూరో: నగరంలో మౌలిక వసతులను మెరుగుపరచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతున్నది. ఉప్పల్ స్కై వాక్ వే తరహాలో నగరంలో అత్యంత రద్దీగా ఉండే మెహదీపట్నం కేంద్రంగా స్కై వాక్ వేను నిర్మించేందుకు హెచ్ఎండీఏ పనులు చేపట్టింది. కానీ భూసేకరణ, ట్రాఫిక్ సమస్యలు, కమర్షియల్ భవనాల తొలగింపు వంటి కారణాలతో ఆటంకాలు ఏర్పడ్డాయి. కానీ వీటిని గత ప్రభుత్వమే పరిష్కరిస్తూ చర్యలు చేపట్టింది. కానీ దూసుకువచ్చే వాహనాల నుంచి రక్షణ కల్పించే స్కైవాక్ వే నిర్మాణం మాత్రం పూర్తి కావడం లేదు.
ముంబై హైవే, శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లే మార్గాల్లో అత్యంత ట్రాఫిక్ మెహదీపట్నం జంక్షన్లో ఉంటుంది. సిటీ బస్సులు ఓవైపు, ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనాలతోపాటు, నిత్యం వేలాదిగా ఐటీ కారిడార్‌కు ప్రయాణించే వాహనదారులతో ఈ ప్రాంతం కిక్కిరిపోతున్నది. దీంతో వాహనదారులే ఇబ్బంది పడుతుంటే… పక్కనే ఉండే రైతు బజార్‌కు వచ్చే కొనుగోలుదారులతో నిత్యం ట్రాఫిక్ నిలుస్తూనే ఉంటుంది. దీంతో కనీసం బాటసారులు కూడా నడిచే పరిస్థితి ఉండదు.
దీంతో ట్రాఫిక్ సమస్యల నుంచి పాదచారులకు ఇబ్బందులు లేకుండా ఉండేలా, ప్రమాదరహిత మార్గంగా స్కైవాక్ వేలను గత ప్రభుత్వం డిజైన్ చేసింది. ఇందులో ఒకటి ఉప్పల్ జంక్షన్లో ఏర్పాటు చేయగా, రెండోది మెహదీపట్నంలో నిర్మించేందుకు పనులు చేపట్టారు. దాదాపు రెండేండ్లుగా ఆ పనులు సాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఆ ప్రాజెక్టు నిర్మాణ దశలోనే ఉండటంతో… పాదచారులకు ఇబ్బందులు తప్పడం లేదు.