హైదరాబాద్: స్వామి వివేకానంద (Swami Vivekananda) 1893 ఫిబ్రవరి 13న సందర్శించిన సికింద్రాబాద్లోని మెహబూబ్ కాలేజీ (Mehboob College) ముమ్మాటికీ పుణ్యక్షేత్రమేనని హైదరాబాద్ రామకృష్ణ మఠం(Ramakrishna Mutt) అధ్యక్షులు స్వామి బోధమయానంద పేర్కొన్నారు. స్వామి వివేకానంద తన జీవితంలోనే తొలిసారి మెహబూబ్ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆంగ్ల ప్రసంగం చేసి నాటి సభికులను మంత్రముగ్ధులను చేశారని ఆయన గుర్తు చేశారు.
మెహబూబ్ కాలేజీలో వివేకానంద చేసిన ప్రసంగం 1893 సెప్టంబర్ 11న చికాగో(Chicago) ప్రసంగం విజయవంతమవడానికి స్ఫూర్తిగా నిలిచిందని తెలిపారు . ఈ చారిత్రక ఘట్టానికి తగిన ప్రాధాన్యతనిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 13ను వివేకానంద డేగా గుర్తించాలన్నారు. స్వామి వివేకానంద భాగ్యనగరంలో మొత్తం వారం రోజులు పర్యటించారని, ఈ సందర్భంగా రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో సప్తాహం జరిపితే బాగుంటుందని అన్నారు.
స్వామి వివేకానంద జీవితం నుంచి ఆత్మవిశ్వాసాన్ని అలవరచుకోవాలని విద్యార్థులు, యువతకు సూచించారు. స్వామి వివేకానంద స్ఫూర్తితో ఎదిగిన 90 శాతం వైకల్యం ఉన్నా చంద్రకాంత్ సాగర్ను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఈ సందర్భంగా ప్రణవ్ ఎంటర్ప్రైజెస్ అధినేత చంద్రకాంత్ సాగర్ను రామకృష్ణ మఠం స్వాములు సన్మానించారు. రామకృష్ణ స్వాములు, మెహబూబ్ కాలేజీ, స్కూల్ కమిటీ సభ్యులు, వాలంటీర్లు పాల్గొన్నారు.