Mega Health Camp | అమీర్పేట్, సెప్టెంబర్ 11 : బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ ఆవరణలో 12వ తేదీ శుక్రవారం ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నారు. దేవాలయ పాలక మండలి సభ్యులు డాక్టర్ హరిరాయ చౌదరి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ శిబిరంలో జనరల్, గైనిక్, చర్మ, కంటి, దంత, రక్త నాళాలకు సంబంధించిన వైద్య పరీక్షలతో పాటు బీపీ, షుగర్ వంటి సాధారణ వైద్య పరీక్షలు ఈ శిబిరంలో అందుబాటులో ఉండనున్నాయి.
ఈ మధ్య కాలంలో వయోధికులే కాకుండా మధ్య వయసులో ఉన్న వారు కూడా రక్తనాళాల సమస్యల కారణంగా ఎక్కువ సమయం నిలబడలేని పరిస్థితులు ఉంటున్నాయని, ఇటువంటి అరుదైన సమస్యలకు కూడా ప్రముఖులైన వైద్య నిపుణులచే శిబిరంలో వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, భక్తులతో పాటు సాధారణ ప్రజలు కూడా ఈ శిబిరంలో తమ వైద్య పరీక్షలు ఉచితంగా పొందవచ్చని శిబిరం నిర్వాహకులు డాక్టర్ హరిరాయ చౌదరి తెలిపారు. ఉదయం 8 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగే ఈ శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్న వారికి డాక్టర్లు చేసే ఆరోగ్య సూచనలతో పాటు ఉచితంగా మందులను కూడా అందజేయడం జరుగుతుందని తెలిపారు.