Hyderabad | బడంగ్ పేట, ఫిబ్రవరి 9: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ మీర్పేట మర్డర్ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. వెంకట మాధవిని అత్యంత కిరాతకంగా చంపడంతో పాటు ఆధారాలు లేకుండా మాయం చేయడం మొత్తం ఆమె భర్త గురుమూర్తి ఒక్కడే చేయలేదని పోలీసులు అనుమానిస్తున్నారు. గురుమూర్తితో పాటు మరో ముగ్గురు ఆయనకు సహకరించారని భావిస్తున్నారు.
వెంకట మాధవి మర్డర్ మిస్టరీలో గురుమూర్తికి ఇద్దరు వ్యక్తులతో పాటు మరో మహిళ కూడా సహకరించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే గురుమూర్తి నుంచి మరిన్ని విషయాలను రాబట్టాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే నాలుగు రోజుల విచారణ నిమిత్తం గురుమూర్తిని మీర్పేట పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కాగా, గురుమూర్తికి సహకరించిన ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గురుమూర్తికి ఇతరులు సహకరించారన్న విషయాన్ని మాత్రం ఇంకా పోలీసులు ధ్రువీకరించలేదు.
గురుమూర్తితో పాటు అతని తల్లిని, సోదరుడిని, చెల్లెలిని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. గురుమూర్తి ఒక్కడే భార్యను చంపాడా? కుటుంబ సభ్యులు ఏమైనా సహకరించారా? అన్న కోణంలో కష్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. భార్యను ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకబెట్టి పొడి పొడిగా చేసి చెరువులో పడేసినట్లు, బకెట్లో ముక్కలు వేసి హీటర్లో పెట్టి ఉడకపెట్టినట్లు పోలీసుల విచారణలో గురుమూర్తి అంగీకరించాడు. గురుమూర్తి చెబుతున్న దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందన్న కోణంలో మీర్పేట పోలీసులు మరోసారి గురుమూర్తిని కష్టానికి తీసుకున్నారు.