Israel : ఇరాన్ దాడులనుంచి రక్షణ పొందేందుకు భారతీయులకు ఇజ్రాయెల్ ఆశ్రయం నిరాకరించిందన్న వార్తల్లో నిజం లేదని ఆ దేశం ప్రకటించింది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాంబుల ప్రభావం నుంచి తప్పించుకునేందుకు ఇజ్రాయెల్ ప్రజలు ప్రత్యేక బంకర్లు, షెల్టర్లలో తలదాచుకుంటున్నారు. అయితే, భారతీయులకు అక్కడి బంకర్లు, షెల్టర్లలో ప్రవేశం కల్పించడం లేదని ప్రచారం ఊపందుకుంది.
సోషల్ మీడియాలో దీనిపై విస్తృత ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి కొన్ని ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. మెట్రో స్టేషన్లు, ఇతర పబ్లి్క్ ప్లేసులలో భారతీయులు బహిరంగంగా పడుకుని ఉన్న ఫొటోలు వైరల్‌గా మారాయి. వారికి బంకర్లలో ఆశ్రయం కల్పించకపోవడంతోనే ఇలాంటి ప్రదేశాల్లో ఉంటున్నారని ప్రచార జరిగింది. దీనిపై ఇండియాలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయ ప్రతినిధి గుయ్ నిర్ స్పందించారు. ఈ ప్రచారంలో నిజం లేదన్నారు. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న ఫొటోల్లో భారతీయులు మాత్రమే లేరని, వివిధ వర్గాలు, దేశాలకు చెందిన ప్రతినిధులు ఉన్నారని ఆయన తెలిపారు. ఇక అక్కడ ప్రజలు తలదాచుకున్న మెట్రో స్టేషన్లు ప్రత్యేకంగా యుద్ధ సమయంలో రక్షణ కోసమే రూపొందించినవని అన్నారు.
FAKE NEWS
You can clearly see in the picture people of all ethnicities.
Metro stations are designated and official safe spaces in Israel. Many of my Tel-Aviv friends pass their nights there. And as you can see – Indian nationals are welcome, along with all nationals. https://t.co/kP8sPmZIOd— Guy Nir (@GuyNirIL) March 3, 2026
ఇజ్రాయెల్ ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించిన రక్షణ కేంద్రాలుగా వాటిని పేర్కొన్నారు. అక్కడ ఎవరైనా రాత్రిపూట తలదాచుకోవచ్చని చెప్పారు. ఇతర దేశాలకు చెందినవారితోపాటు భారతీయులకు కూడా అక్కడ ఆశ్రయం ఉంటుందన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వెల్లడించారు. ప్రస్తుత పరిణామాలపై భారత ప్రభుత్వం ఇజ్రాయెల్‌లోని పౌరులకు ఇంతకుముందే హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అక్కడి ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా సురక్షిత కేంద్రాల్లో ఉండాలని, ప్రభుత్వ ఆదేశాలు, అలర్ట్స్ పాటించాలని కోరింది.