రాష్ట్రంలోనే కీలకమైన ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సేవలు ప్రశ్నార్థకంగా మారుతున్నది. ఇన్చార్జీల పాలనలో జవాబుదారీతనం కరువై.. పరిపాలన గాడి తప్పుతున్నది. ఉస్మానియా, నిలోఫర్, కోఠి ఈఎన్టీ, నల్లకుంట ఫీవర్ హాస్పిటల్, సుల్తాన్‌బజార్ ప్రసూతి దవాఖాన, ఎర్రగడ్డ ఛాతి దవాఖానల్లో పూర్తి స్థాయి సూపరింటెండెంట్లు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని సిబ్బంది.. రోగులు వాపోతున్నారు.
– సిటీబ్యూరో, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ)
ఉస్మానియా వైద్య కళాశాల పరిధిలోనే అత్యంత కీలకమైన ఉస్మానియా, నిలోఫర్, కోఠి ఈఎన్టీ, నల్లకుంట ఫీవర్ హాస్పిటల్, సుల్తాన్‌బజార్ ప్రసూతి దవాఖాన, ఎర్రగడ్డ ఛాతి దవాఖానలకు నిత్యం వందలు, వేల సంఖ్యలో రోగులు ఓపీ, ఐపీ సేవలు పొందుతుంటారు. అయితే ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా దీర్ఘకాలంగా అక్కడ పనిచేస్తున్న వైద్యాధికారులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిలోఫర్, ఉస్మానియా, ఈఎన్టీ, నల్లకుంట ఫీవర్ హాస్పిటల్, సుల్తాన్‌బజార్ ప్రసూతి దవాఖానల్లో ప్రొఫెసర్లతో పాటు సూపరింటెండెంట్లు కూడా బదిలీ అయ్యారు. దీంతో ఆ దవాఖానల్లో ఆ పోస్టులు ఖాళీ అయ్యాయి. ఎవరినీ నియమించకపోవడంతో ఇన్చార్జీల పాలన కొనసాగుతున్నది.
ఇన్చార్జి సూపరింటెండెంట్ల పరిపాలనతో పలు దవాఖానల్లో జవాబుదారీతనం ఉండటం లేదని, పరిపాలన గాడితప్పుతున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పూర్తిస్థాయి బాధ్యతలు ఇవ్వకపోవడంతో తాము ఇన్చార్జీలమే కదా, తమకెందుకులే అనే ధోరణితో కొందరు వ్యవహరిస్తున్నారని, దీంతో సరైన జవాబుదారీతనం లేక దవాఖానల్లో పరిపాలన గాడితప్పుతున్నదని స్వయంగా ఆ వైద్యశాలల వర్గాలే చెబుతున్నాయి. నిత్యం 2వేల నుంచి 3వేల మంది ఓపీ, ఐపీ రోగులతో రద్దీగా ఉండే ఉస్మానియా, నిలోఫర్, ఈఎన్టీ, టీబీ, శ్వాస సంబంధ వ్యాధులకు ప్రత్యేకమైన ఎర్రగడ్డ ఛాతి దవాఖాన, సుల్తాన్‌బజార్ ప్రసూతి దవాఖానలకు రోజులు గడుస్తున్నా పూర్తిస్థాయి సూపరింటెండెంట్లను నియమించకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఇన్చార్జీల పాలనతో ఇబ్బందులు తప్పడం లేదని దవాఖాన సిబ్బంది, రోగులు వాపోతున్నారు.
అసలే ప్రొఫెసర్ల కొరత, ఉన్న ఒక్కరిద్దరిలో ఒకరికి ఇన్చార్జి సూపరింటెండెంట్ బాధ్యతలు అప్పగించడంతో ఆయా దవాఖానల్లో వైద్యసేవలు ప్రశ్నార్థకంగా మారుతున్నట్లు రోగులు చెబుతున్నారు. కొన్ని దవాఖానల్లో ఉన్న వారిలో ఒకరికి ఇన్చార్జి సూపరింటెండెంట్ బాధ్యతలు అప్పగించగా, మరికొన్ని వాటిల్లో బయటి నుంచి బదిలీపై వచ్చిన వారికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో వారు పరిపాలన పరంగా బిజీగా మారి వైద్యసేవలు అందించలేకపోతున్నారు. అంతేకాకుండా ఇన్చార్జి బాధ్యతల కారణంగా సదరు అధికారులు పరిపాలనపై పూర్తిస్థాయి దృష్టి పెట్టేందుకు వెనకంజ వేస్తున్నారు. ఫలితంగా పేదలకు సక్రమంగా వైద్యసేవలు అందడం లేదు.
వర్షాకాలంలో వ్యాధులు చుట్టుముడుతున్నాయి. నగరంలో దవాఖానలన్నీ జలుబు, దగ్గు, జ్వరం, డెంగీ తదితర సీజనల్ వ్యాధిగ్రస్తులతో కిక్కిరిసిపోతున్నాయి. ఇలాంటి సమయంలో విషజ్వరాలు, సీజనల్ వ్యాధులకు ప్రత్యేక దవాఖానగా పేరున్న నల్లకుంట ఫీవర్ హాస్పిటల్లో ప్రొఫెసర్లు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మొన్నటి వరకు సూపరింటెండెంట్‌గా ఉన్న డా.శంకర్ బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో ఎవరినీ నియమించకపోవడంతో కోరంటి సూపరింటెండెంట్ పోస్టు ఖాళీగా ఉంది. ప్రస్తుతం ఆర్ఎంవో పరిపాలనలోనే దవాఖాన కొనసాగుతున్నది.