GHMC | సిటీబ్యూరో, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): వేసవి కావడంతో ఎండలు దంచికొడుతున్నాయి. అదే సమయంలో చాలా ప్రాంతాలలో తాగునీరు లభించకపోవడంతో ప్రజలు ప్రైవేటు ట్యాంకర్లు, ఆర్ఓ ప్లాంట్ మినరల్ వాటర్‌పై ఆధారపడుతున్నారు. అయితే నగరంలో జలమండలి పరిధిలో సరఫరా అయ్యే నీటి నాణ్యతలో ఎలాంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ.. మెజారిటీ ప్రైవేటు ట్యాంకర్లు, ఆర్ఓ ప్లాంట్ల ద్వారా సరఫరా చేసే మినరల్ క్యాన్ల ద్వారా సరఫరా చేసే నీటి నాణ్యతపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఆ నీటిని తాగే ప్రజలు రోగాలబారిన పడుతున్నట్లు సమాచారం.
గత పది రోజులుగా నగరంలోని చాలా చోట్ల డయేరియా కేసులు నమోదవ్వడమే దీనికి ఉదాహరణ. దీంతో ప్రైవేట్ ట్యాంకర్లు, మినరల్ వాటర్ క్యాన్లపై ఆధారపడి ఉన్న ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కొంతమంది ప్రైవేటు ట్యాంకర్ల నిర్వాహకులు నీటి నాణ్యతపై ఎలాంటి శ్రద్ధ వహించకుండా ప్రజల డిమాండ్ మేరకు ఎలాంటి శుద్ధి చర్యలు తీసుకోకుండా బోర్ల నుంచి నేరుగా నీటిని నింపి సరఫరా చేస్తున్నారనే విమర్శలున్నాయి.
అదే తరహాలో ఆర్ఓ ప్లాంట్లలో మినరల్ వాటర్ క్యాన్లు విక్రయించే వారు సైతం నీటి నాణ్యత విషయంలో ఎలాంటి ప్రమాణాలు పాటించడం లేదనే విమర్శలున్నాయి. అటు ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల విషయంలోగాని.. ఇటు మినరల్ వాటర్ ప్లాంట్ నిర్వాహకుల విషయంలో గాని సంబంధిత అధికారుల సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కలుషిత నీరు తాగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.
జ్యూస్‌లు, చల్లటి పానీయాలతో….
వేసవిలో దాహార్తిని తీర్చుకోవడానికి చాలామంది రోడ్లపై విక్రయించే చల్లటి పానీయాలు, పళ్లరసాలు వంటి వాటిని ఎక్కువగా తాగుతుంటారు. అయితే వీటిని తయారు చేసే క్రమంలో వినియోగించే నీరు కలుషితమైతే డయేరియా వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు వైద్యులు.
పరిశుభ్రత లేనిచోట పానీయాలు, జ్యూస్‌లు తాగవద్దని సూచిస్తున్నారు. అలాగే వీధుల వెంట విక్రయించే పానీపూరి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని పానీపూరిలో వినియోగించే మసాలా నీటి వల్ల డయేరియాకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పరిశుభ్రత, స్వచ్ఛత లేని చోట ఎలాంటి ఆహార పదర్థాలుగాని, పానీయాలు గాని తీసుకోవద్దని సూచిస్తున్నారు.
స్వచ్ఛమైన నీటినే తాగాలి
ప్రజలు తాగునీటి విషయంలో జాగ్రత్తలు వహించాలి. కలుషిత నీటి వల్ల డయేరియా వంటివి వస్తుంటాయి. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు స్వచ్ఛమైన నీటినే తాగాలి. బయటి జ్యూస్‌లు, కూల్‌డ్రింక్స్ వంటి వాటికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. కొబ్బరి నీళ్లు, తాజా పళ్ల రసాలు, మజ్జిగ వంటివి తీసుకోవడం ఉత్తమం. వాంతులు, విరేచనాలు వంటివి జరిగితే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. అలాగే నీటిని కాచి, చల్లార్చి తాగడం ఉత్తమం.
– డాక్టర్ రాజారావు, సూపరింటెండెంట్, యాదాద్రి భువనగిరి ప్రభుత్వ దవాఖాన