సిటీబ్యూరో, మార్చి28, (నమస్తే తెలంగాణ) : మన శరీరానికి కాస్తంత ఎండ తగిలితే చాలు.. శీతల పానియాలు తాగేందుకు వెనుకాడం. ఇక ఎండాకాలం వస్తే చెప్పనవసరం లేదు. రోడ్లపైన కనిపించే కూల్‌డ్రింక్ దుకాణాల ముందుకు పరుగులు తీస్తూ వెళ్లి మరీ తాగుతాం. అయితే ఎక్కడపడితే అక్కడే నాణ్యత, పరిశుభ్రత విషయాలు పక్కన పెట్టి వెంటనే చల్లగా ఐస్ వేసుకొని తాగుతారు. మరీ ఆ ఐస్ శుభ్రంగా ఉందో లేదో కూడా క్షణమైనా ఆలోచించకుండా ఆ పానీయాలు తాగి చివరకు వాంతులు, విరేచనాలకు గురవుతారు. దీంతో క్రమంగా జ్వరాల బారిన పడతారు. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లాలో ఇదే ధోరణి కొనసాగుతున్నది. నల్లగుంటలో ఉన్న ఫివర్ ఆసుపత్రికి మూడు రోజుల నుంచి 1400 వరకు ఔట్ పేషెంట్లు వాంతులు, విరేచనాలు, జ్వరంతో బాధపడుతూ చికిత్స కోసం రావడం ఆందోళనను కలిగిస్తున్నది.
హైదరాబాద్ జిల్లాలో మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అందులో భాగంగా ప్రజలు ఎండ నుంచి ఉపశమనం కోసం శీతల పానీయాలను విపరీతంగా తాగుతున్నారు. రోడ్ల పక్కన ఫుట్‌పాత్‌లపై, బండ్లమీద, బేకరీల్లో విక్రయించే కూల్ డ్రింక్స్‌ను లొట్టలేసుకుంటూ.. తాగుతున్నారు. నిజానికి చెరుకు రసం, ఇతర శీతల పానీయాలు తయారు చేసేందుకు వాడే ఐస్ అపరిశుభ్రంగా ఉండటం, చుట్టూ ఈగలు చేరడం మూలానా వాటిని తాగిన వెంటనే గొంతునొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రస్తుతం జిల్లాలోని కింగ్కోటీ, ఫివర్, ఏరియా, బస్తీ దవాఖానాల్లో అనారోగ్యంతో వచ్చే ఔట్యపేషెంట్లలో అధిక శాతం జ్వరం, గొంతు నొప్పి, వాంతులు వంటి సమస్యలతో బాధపడుతున్నవారే ఉండటం గమనార్హం.
బయట నిమ్మరసం, చెరుకు రసం వంటి శీతల పానీయాల్లో వేసే ఐస్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఐస్ తయారీ అనంతరం దాన్ని తరలించేందుకు ఆటోలు, ఇతర వాహనాల్లో తరలించే సందర్భంలో అనేక క్రిములు దానిపై చేరుతాయి. అనంతరం డ్రమ్ములో దాన్ని నిల్వచేసి, మనకు కూల్ డ్రింక్స్‌లో కలిపి దుకాణదారులు ఇస్తారు. వాటిలో ఏర్పడే క్రిములు మన శరీరంలోకి చేరి, అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయి. దీంతో రోగాలతో బాధపడాల్సిన పరిస్థితి నెలకొంటుంది.