సిటీబ్యూరో, మే 7 (నమస్తే తెలంగాణ): ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అవసరమైన ముందస్తు చర్యలను చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగానే వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా ట్రామా కేర్, ప్లాస్టిక్ సర్జరీ విభాగం, జనరల్ మెడిసిన్ విభాగం, క్రిటికల్ కేర్ విభాగం, ఎస్ఐసీయూ, ఎంఐసీయూ తదితర విభాగాలను అప్రమత్తం చేశారు.
ఏవైనా విపత్కర పరిస్థితులు ఎదురైతే సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు నగరంలోని ఉస్మానియా, గాంధీ, నిమ్స్ తదితర దవాఖానల్లో ముందస్తు చర్యగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అన్ని దవాఖానల్లో అత్యవసర పడకలు, ఆక్సిజన్, వెంటిలెటర్ పడకలను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యంగా గాంధీలో అత్యవసర సేవలు అందించేందుకు సన్నద్ధంగా ఉన్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి వెల్లడించారు.
2016 పడకల సామర్థ్యం గల గాంధీ దవాఖానలో ప్రతినిత్యం 1600 నుంచి 1700ల వరకు బెడ్ ఆక్యుపేషన్ ఉంటుందని, ఏవైనా విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సుమారు 500 ఆక్సిజన్ బెడ్లు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. వీటితో పాటు 25 పడకల సామర్థ్యం ఉన్న మెడికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, 16 పడకల సామర్థ్యం ఉన్న సర్జికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ను సైతం అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధం చేసినట్లు ఆమె వెల్లడించారు.
ఉస్మానియా దవాఖానలో సైతం అత్యవసర పరస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యులు తీసుకుంటున్నట్లు దవాఖాన సూపరింటెండెంట్ డా.రాకేశ్ సాహె తెలిపారు. తాము సైతం విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని నిమ్స్ డైరెక్టర్ డా.బీరప్ప తెలిపారు.
ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో..
– ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
కుత్బుల్లాపూర్, మే 7:పహల్సాం ఉగ్రదాడికి ప్రతీకారంగా మంగళవారం అర్ధరాత్రి పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిక్షణా శిబిరాలపై భారత సైన్యం జరిపిన ఆపరేషన్ సింధూర్ దాడులపై కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ స్పందిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. మానవాళికి నష్టం కలిగించే ఏ ఉన్మాదం, ఉగ్రవాదం వంటి ఏ చర్య అయినా కూకటివేళ్లతో పెకిలించి వేయాలన్నారు.
భారత సైనికులకు అండగా నిలుద్దాం
– కోలేటి దామోదర్
ఉగ్రవాదాన్ని తుద ముట్టించి దేశాన్ని రక్షించుకునేందుకు భారతీయులందరూ ఒకటై పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని తెలంగాణ రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ అన్నారు. భారత సైనికులకు అండగా నిలుద్దామని ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.