మేడ్చల్, మే 24 : పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐతో సంబంధం ఉన్న గ్యాంగ్‌స్టర్ అనుచరులతో సంప్రదింపులు జరుపుతూ నేర ప్రపంచంలోకి అడుగుపెట్టే దిశగా ప్రయత్నాలు చేస్తున్న యువకుడిని మేడ్చల్ పోలీస్‌లు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో మేడ్చల్‌లో అతడు పని చేస్తున్న హోటల్‌పై సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ సత్యనారాయణ ఆదివారం వెల్లడించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌కు చెందిన జాయిద్ఖాన్(22) మేడ్చల్‌లో జాతీయ రహదారి పక్కన ఉన్న ముబారక్ హోటల్లో పని చేస్తున్నాడు. అతడు నకిలీ తుపాకీతో రీల్స్ చేసి, ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్టు చేస్తూ ప్రజలకు భయబ్రాంతులకు గురి చేస్తున్న ట్టు వచ్చిన సమాచారం మేరకు శనివారం పోలీసులు ఇద్దరు సాక్షులతో కలిసి ముబారక్ హోటల్‌కు వెళ్లారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెట్టిన వ్యక్తిని జాయీద్గా గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు.
ఘాజియాబాద్ టూ మేడ్చల్
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌కు చెందిన జాయిద్ఖాన్ ఆలియాస్ ఆదిల్‌ఖాన్ నాలుగో తరగతి వరకు చదువుకున్నాడు. 2021లో అతడు కోల్‌కతాకు వెళ్లి, అక్కడ వీధి దుస్తుల వ్యాపారికి సహాయకుడిగా పని చేశాడు. ఆ తర్వాత 2024లో తిరిగి ఘాజియాబాద్‌కు వచ్చి, రోహిత్ బ్యాగ్ హౌజ్‌లో సహాయకుడిగా పని చేశాడు. జాయిద్ఖాన్ బంధువు అయిన ఫైజాన్ హైదరాబాద్ నగర్ శివారులోని మేడ్చల్‌లో ఉన్న ముబారక్ హోటల్లో సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. అతడి సూచన మేరకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ముబారక్ రెస్టారెంట్లో వెయిటర్‌గా ఉద్యోగంలో చేరి, అక్కడే నివాసం ఉంటున్నాడు. 2021 నుంచి ఇన్‌స్టామ్‌గ్రామ్, ఫేస్బుక్, స్నాప్చాట్లలో రీల్స్ రూపొందించి పోస్టు చేస్తున్నాడు.
2023లో ఒక బొమ్మ పిస్తోల్ కొనుగోలు చేసి, ఆ పిస్తోల్‌తో రీల్స్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ వ్యూస్ రావాలని పోస్టులు పెడుతున్నాడు. నిజమైన తుపాకీని కొనుగోలు చేయాలని మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాకు చెందిన దేశీ తుపాకులు సరఫరా చేసే వ్యక్తిని ఫోన్లో సంప్రదించాడు. అదే ఆసక్తితో ఆబీద్ జుట్టు, రాణా హుస్సేన్ నిర్వహిస్తున్న ఇన్స్టాగ్రామ్ ఖాతాలను ఫొలో అవడం ప్రారంభించాడు. ఆ తర్వాత వారిద్దరు పాకిస్తాన్‌కు చెందిన షాహెజాద్ బాట్టీ అనే గ్యాంగ్‌స్టర్‌తో అనుబంధం కల్గి ఉన్నారని జాయీద్కు తెలిసింది.
ఆబిద్ అభ్యర్థన మేరకు చోటా యోగి అనే వ్యక్తి లోకేషన్ వివరాలను ఇన్‌స్టాగ్రామ్‌లో ద్వారా షేర్ చేశాడు. ఈ నెల 10న అబిద్ తన ఫొటో కింద పాకిస్తానీ డాన్ అబిద్ జుట్టు అనే క్యాప్సన్‌తో కూడిన పోస్టర్‌ను పంపి, దాన్ని 1000 పోస్టర్లపై ముద్రించి, ఘాజియాబాద్‌లో అంటించాలని సూచించాడు. అలా చేస్తే తనకు నిజమైన పిస్తోల్ ఇస్తానని హామీ ఇచ్చాడు. అయితే అతడు హైదరాబాద్‌లో ఉండటంతో అక్కడికి వెళ్లినప్పుడు ఆ పని చేద్దామని అనుకున్నాడు. ఈనెల 20న రానా హుస్సేన్ నుంచి యోగి ఆదిత్యనాథ్ వ్యక్తిగత సహాయకుడి మొబైల్ నంబర్ ఇవ్వాలని సందేశం రాగా జావీద్ ఇంటర్నెట్ ద్వారా సేకరించిన ఉత్తర్‌ప్రదేశ్ కేబినెట్ సభ్యుల పబ్లిక్ కాంటాక్ట్ వివరాలను పంపించాడు.
అలాగే రాణా హుస్సేన్‌ను తనకు ఒక పిస్తోల్ కావాలని అడుగగా రూ.65వేలు చెల్లిస్తే ఇప్పిస్తానని తెలిపాడు. పదే పదే పిస్తోల్ కోసం వారిని అడుగుతుండటంతో ఎందుకు పిస్తోల్ అని వారు అడుగగా ఇస్లాం కోసం పోరాడేందుకు అని తెలిపాడు. అలాగే సంఘటిత నేర ముఠాతో తనను అనుసంధానించుకోవాలని ఉన్న ఆసక్తిని కూడావారి ముందు కనబర్చినట్టు పోలీసుల విచారణ వెల్లడైంది. ముబారక్ హోటల్లో పోలీసులు జాయీద్ ఖాన్ అదుపులోకి తీసుకొని, అతడి నుంచి రెండు నకిలీ తుపాకులు, మొబైల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ మొబైల్ ఫోన్లను పరిశీలించగా దేశ వ్యతిరేక ఉగ్ర ముఠాలతో సంప్రదింపులు జరిపిన స్క్రీన్ షాట్లు కన్పించాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.