మేడ్చల్, డిసెంబర్7(నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ శ్రేణులు విజయవంతం చేయాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పిలుపునిచ్చారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా గండిమైసమ్మ సమీపంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఈ నెల 9న ప్రారంభించనున్న నేపథ్యంలో శంభీపూర్ రాజు శనివారం ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హాజరు కానున్నట్లు చెప్పారు. కేటీఆర్‌తో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో పాటు రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, రాజ్యసభసభ్యులు, పార్టీ రాష్ట్ర నాయకులు హాజరువుతున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, కేపీ వివేకానంద్, మాధవరం కృష్ణారావు, మర్రి రాజశేఖర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసిగిపోయారని శంభీపూర్ రాజు విమర్శించారు.
ఏడాది కాంగ్రెస్ పాలనలో అణిచివేతలు, అరాచకాలు, కూల్చివేతలు, జైళ్లు, కేసులు తప్ప..ఏమీ లేవని చెప్పారు. ప్రజాపాలన కాదని.. తెలంగాణలో రాక్షస పాలన కొనసాగుతున్నదన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉన్న రోజులను తెలంగాణ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారన్నారు. ఆరు గ్యారెంటీల్లో ఏ పథకాన్ని అమలు చేయకుండానే ఏడాది పాలనపై వారోత్సవాలు చేసుకోవడంపై ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఛీ కోడుతున్నారని చెప్పారు. కాగా, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయం ఆవరణలో జరుగుతున్న ఏర్పాట్లను ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పరిశీలించారు.