సిటీబ్యూరో, జూలై 3 (నమస్తే తెలంగాణ): వర్షాకాలం వచ్చిందంటే వాహనాల వినియోగం విషయంలో జాగ్రత్తలు తప్పనిసరని మెకానిక్ నిపుణులు చెబుతున్నారు. వర్షంలో డ్రైవ్ చేయడం ప్రమాదకరమని అంటున్నారు. లైట్ నుంచి బ్రేక్ వరకు ప్రతీది నాణ్యతగా ఉండేల పరిశీలించుకోవాలని సూచిస్తున్నారు. కండిషన్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెబుతున్నారు. వర్షం కారణంగా వాహనాలు తరుచూ మొరాయిస్తున్నాయి. దీంతో రోడ్లపై బైకులు సడన్‌గా ఆగిపోతే.. పెట్రోల్, బ్రేకులు, ఇంజన్ ఆయిల్, క్లచ్ తదితరవి చెక్ చేసుకోకుంటే ప్రమాదం పొంచి ఉంటుందని మెకానిక్‌లు హెచ్చరిస్తున్నారు. చిన్న రిపేర్లే కదా అని తేలికగా తీసుకుంటే రోడ్లపై ఇబ్బందులు ఎదుర్కోవడమే కాదు.. ఆ ప్రభావం బైక్, కారు ఇతర భాగాలపై పడి వేలల్లో డబ్బులు గుల్ల అవుతాయి. వాహనాల పనితీరును ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాల్సిన అసవరం ఉంది.
వర్షంలో వీటిపై అవగాహన అవసరం..
వర్షంలో బైకులు తరుచుగా ఆగిపోతుంటాయి. ఎంత కిక్ కొట్టినా స్టార్ట్ కావు. ఏమైందో కూడా తెలియని పరిస్థితి. బండి సడన్‌గా ఆగిపోయిందంటే కిక్ మీద కిక్ కొడుతూ ఉంటాం. కానీ ఇంజన్‌కు ఉన్న ప్లగ్ పాయింట్లోకి నీళ్లు చేరడం వల్ల బండి ఆగిపోయిందన్న విషయం మనకు అర్థం కాదు. ఆ విషయం తెలియక బండిని స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంటాం. కిక్ వరుసగా కొట్టడంతో పెట్రోల్ ఓవర్ ఫ్లో అయి.. ప్లగ్‌పాయింట్‌కు తగిలి ప్లగ్ షాట్ అయిపోతుందని మెకానిక్‌లు చెబుతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితి ఎదురయినప్పుడు ప్లగ్ క్యాప్ తీసేసి.. దానిని తుడవాలి. అనంతరం యథావిధిగా అమర్చిన తర్వాత బండి స్టార్ట్ చేయాలి.
చక్రాలు సాఫీగా తిరగాల్సిందే..
సమయానికి సర్వీసింగ్ చేయించాలి
వర్షాకాలంలో వాహనాలు తరుచూ మొరాయిస్తుంటాయి. రోడ్లపై ఆగిపోతుండటం చూస్తుంటాం. అయితే వాహనాల పట్ల జాగ్రత్తలు తీసుకుంటే మేలు. వాహనాలకు సర్వీసింగ్ సమయానికి చేయిస్తూ ఉండాలి. బైక్‌లకు ప్రతి 2వేల కిలోమీటర్లకు సర్వీసింగ్ చేయించాలి. రెండు నెలకు ఒకసారి ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయాలి. ఇలా చేస్తే బైకులకు ఎలాంటి సమస్యలు రావు. కొన్ని సమయాల్లో బండి డ్రైవ్‌లో ఉన్నప్పుడే క్లచ్ వైర్ తెగిపోతుంది. దానివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. క్లచ్ నాణ్యతను ముందే గుర్తించాలి.
– ప్రశాంత్, బైక్ మెకానిక్, చిక్కడపల్లి
టైర్ల పనితీరు చెక్ చేసుకోవాలి
టైర్ల పనితీరు సరిగా లేకపోతే స్కిడయ్యే ప్రమాదం అధికంగా ఉంటుంది. సడెన్ బ్రేకులు వేసినా ప్రమాదమే. అందుకే టైర్ల పనితీరు బాగుండేలా చూసుకోవాలి. కారు మోడల్‌ను బట్టి టైర్లు.. వాటి పరిమాణాన్ని బట్టి ఎయిర్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. కారు బ్రేకుల పనితీరు తగ్గితే వెంటనే మెకానిక్కు చూపించాలి. వర్షంకాలంలో బ్రేకులు త్వరగా క్షీణిస్తాయి.
– నాయుడు, కార్ మెకానిక్, మారుతీ షోరూం