సిటీబ్యూరో, జూన్ 6 (నమస్తే తెలంగాణ ) : కేబీఆర్ పార్కుకు మరిన్ని హంగులను సమకూర్చేందుకు చర్యలు వేగవంతం చేసినట్లు జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ (యూబీడీ) డాక్టర్ సునంద తెలిపారు. డిప్యూటీ డైరెక్టర్ బాలయ్య, ఇంజినీర్ మణిపాల్‌తో కలిసి గురువారం జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ విభాగం అదనపు కమిషనర్ డాక్టర్ సునంద కేబీఆర్ పార్కులో పర్యటించారు. కమిషనర్ రొనాల్డ్ రాస్ ఆదేశాల మేరకు కేబీఆర్ పార్కులో కొనసాగుతున్న పనుల పురోగతిని పరిశీలించారు. పార్కు నిరంతరం పచ్చని వాతావరణంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పరిశుభ్రత, చెట్ల ట్రిమ్మింగ్, గ్రీన్ వేస్ట్ లిఫ్టింగ్ పనులపై దృష్టి సారించాలన్నారు. బిందు సేద్యం (డ్రిప్ సిస్టం) ఏర్పాటు చేసి పచ్చదనం పెంపొందించాలని, బేబీ పాండ్‌ను క్రమపద్ధతిలో శుభ్రం చేయాలని సూచించారు. అనంతరం ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించిన పురోగతి పనులపై ప్రత్యేకంగా చర్చించారు. పార్కు చుట్టూ కెర్బ్ వాల్ పెయింటింగ్, చెట్ల చుట్టూ ఉన్న అన్ని స్టోన్ సీటింగ్లను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం, క్యాన్సర్ ఆసుపత్రి వ్యర్థాలు పార్కులోకి రాకుండా నియంత్రణ, పార్కులో వరద నీటి నివారణ, డ్రైనేజీ మళ్లింపు, పాడైన గ్రిల్స్‌కు ప్రత్యామ్నాయం, మరమ్మతులు, గ్రానైట్ ఫ్లోరింగ్ పనులను యూబీడీ విభాగం అధికారుల సమన్వయంతో నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అదనపు కమిషనర్ సునంద ఆదేశించారు.