సిటీబ్యూరో, జూన్ 17 (నమస్తే తెలంగాణ): సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అడిషనల్, జోనల్, డిప్యూటీ కమిషనర్లు, ఏఎంఅండ్హెచ్ఓలు, ఎంటమాలజీ అధికారులతో శానిటేషన్, దోమల నివారణ, ఆస్తిపన్ను వసూళ్లపై కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. దోమల నివారణకు చేస్తున్న ఫాగింగ్‌పై అసిస్టెంట్ మెడికల్ అధికారి పూర్తి బాధ్యత ఉంటుందని కమిషనర్ స్పష్టం చేశారు. కాలనీలు, కాలాజీల్లో ఫాగింగ్ చేపట్టే విధానంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఫాగింగ్ షెడ్యూల్డ్ సంబంధిత కార్పొరేటర్‌కు సమాచారం ఇవ్వాలని కమిషనర్ సూచించారు.
ఆస్తిపన్నుల టార్గెట్ పూర్తిచేయాలి..
శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ వార్డుల వారీగా జరుగుతున్న నేపథ్యంలో చెత్తను సకాలంలో రాంకీ ఎస్ఎస్ఆర్ వాహనాలు ద్వారా తరలించాలని కమిషనర్ కర్ణన్ ఆదేశించారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు ఆస్తి పన్ను వసూలు చేయాలని బిల్ కలెక్టర్లను ఆదేశించారు. ప్రతీ నెల టాక్స్‌పై సమీక్ష నిర్వహిస్తామన్నారు. బౌన్స్ చెకులు బేగం పేట్, సరూర్‌నగర్‌లో ఎకువ వచ్చినందున వాటిని వెంటనే క్లియర్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత డీసీలను ఆదేశించారు. నగరంలో కుకల బెడద నివారణ చర్యలు తీసుకోవాలని కమిషనర్ కర్ణన్ అధికారులకు సూచించారు. అడిషనల్ కమిషనర్లు రఘు ప్రసాద్, పంకజ, జోనల్ కమిషనర్లు హేమంత్ కేశవ్ పాటిల్, అపూర్వ చౌహాన్, హేమంత్ సహదేవ్ రావు, రవి కిరణ్, వెంకన్న పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
శిల్పా లే ఔట్ ఫేజ్-2 ఫ్లైఓవర్ సుందరీకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. ఓఆర్ఆర్ నుంచి గచ్చిబౌలి వర కు రూ.178 కోట్ల వ్యయంతో చేపట్టిన శిల్పా లే ఔట్ ఫ్లైఓవర్ పనులను మంగళవారం కమిషనర్ ప్రాజెక్టు విభాగం అధికారులతో కలిసి పనులను పరిశీలించారు. అలాగే గచ్చిబౌలి, హఫీజ్‌పేట్ ఫ్లైఓవర్లు, ఇతర అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం స్థానిక కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్‌తో కలిసి కమిషనర్ కర్ణన్ పలు ప్రాంతాలను పరిశీలించారు. హఫీజ్‌పేట ఫ్లై ఓవర్ కింద వ్యర్థాలను తొలగించి క్రీడలకు అనుకూలంగా తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.