ఖైరతాబాద్, ఫిబ్రవరి 6 : నిమ్స్ క్యాంటీన్లో భోజనాలు, తినుబండారాలు తీసుకుంటే సామాన్యులకే కాదు..వైద్యులకు రోగాలు తప్పవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆహారంలో నాణ్యతా లోపం, అపరిశుభ్ర వాతావరణం వెరసి తిన్న వారికి కొత్త రోగాలను అంటించే నిలయంగా మారిందంటున్నారు. రెండేండ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ క్యాంటీన్ ఆహారం తయారీలో నాణ్యత ప్రమాణాలకు పూర్తిగా తిలోదకాలు ఇచ్చినట్లు తెలిసింది. ఫలితంగా రోగాలు నయం చేసుకోవడానికి వచ్చే రోగులు, ఆ రోగులకు వైద్య సేవలందించే వైద్యులు ఇక్కడ తింటే రోగగ్రస్తులు కాక తప్పదంటున్నారు.
రెండేండ్ల క్రితం బాధ్యతలను దక్కించుకున్న నక్షత్ర సంస్థ మెయిన్ క్యాంటీన్ పేరుతో నిమ్స్ పాత ఔట్ పేషెంట్ బ్లాకులోని పాత క్యాంటీన్ స్థానంలో ఏర్పాటు చేశారు. ఈ క్యాంటీన్ వెనుక వైపు గోడ నిమ్స్ మార్చూరికి ఆనుకొని ఉంటుంది. ఆస్పత్రిలోని వివిధ వార్డుల్లో ఉన్న రోగులతో పాటు వైద్య విద్యార్థులు, ఆరోగ్యశ్రీ వార్డుకు సైతం ఈ క్యాంటీన్ ద్వారానే ఆహారం సరఫరా అవుతుంది. నిమ్స్ దవాఖానకు నిత్యం 3 నుంచి 4వేల మంది రోగులు వారి సహాయకులతో వస్తుంటారు.
ఈ నేపథ్యంలోబయట హోటళ్లకు వెళ్లే సమయం లేక ఇక్కడే ఆహారాన్ని తీసుకుంటుంటారు. ఈ నేపథ్యంలో నాణ్యత, రుచి, శుచి, శుభ్రత లేని ఈ క్యాంటీన్లో తప్పని సరి పరిస్థితుల్లో తిండి తిని తద్వారా రోగాల బారిన పడితే మళ్లీ నిమ్స్‌లో చేరాల్సిన దుస్థితి దాపురిస్తుందని పలువురు వాపోతున్నారు. రేట్లు సైతం పెద్ద హోటళ్లను మించిపోతుందని అంటున్నారు. కొందరు వైద్యులైతే ఇక్కడి వాతావరణం, ఆహార నాణ్యత చూసి క్యాంటీన్లో భోజనం చేయడమే మానివేసినట్లు ఓ వైద్యుడు తెలిపారు.
నిమ్స్‌లోని మెయిన్ క్యాంటీన్ వెలుపలే ఆస్పత్రి డైటీషియన్ కార్యాలయం గది ఉంది.రోగులకు వారి వారి అనారోగ్య స్థితి ఆధారంగా డైట్‌ను సూచిస్తారు. అంతే కాకుండా నిమ్స్ దవాఖానలోని క్యాంటీన్లో ఆహార నాణ్యత ప్రమాణాలను సైతం పర్యవేక్షించాల్సి ఉంటుంది. కాని సదరు అధికారి అలసత్వమో..నిర్లక్ష్యమో..ఆ గది ముందే క్యాంటీన్ యాజమాన్యం టేబుళ్లు, కుర్చీలు వేసి హోటల్‌గా మార్చివేసినా పట్టించుకోక పోవడంపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా యాజమాన్యం, ఫుడ్ సేఫ్టీ విభాగం నిమ్స్‌లో ఉన్న క్యాంటీన్ల ఆహార నాణ్యతపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.