సిటీబ్యూరో: మూసీ పరీవాహక నిరుపేదలను భయపెట్టి, వరదలతో తరిమేయాలని రేవంత్ సర్కారు ఎత్తుగడ పారలేదు. నీరు పేదల ఇండ్ల మీదకు వరదను వదలి, జలదిగ్బంధం చేసిన కుట్ర సఫలం కాలేదు. జంట జలాశయాలకు ఎగువన ఉండే పరీవాహక క ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉన్నాయని, భారీ వరదలకు ఆస్కారం ఉందని ముందస్తు హెచ్చరికలు ఉన్నా ఉద్దేశపూర్వకంగా పెడచెవిన పెట్టిన సర్కారు… జంట జలాశయాల నుంచి భారీగా నీటిని వదలి నగరంపై జల ఖడ్గాన్ని దూసింది.
ఈ పరిణామంతో మూసీ పరీవాహక ప్రాంత నిరుపేదలు కట్టుబట్టలతో, చెట్టుకొక్కరు, పుట్టకొక్కరుగా తరలిపోయారు. ప్రధాన రహదారులతోపాటు, పండుగ వేళల్లో అత్యంత రద్దీగా ఉండే ఎంజీబీఎస్ ప్రాంతం జలదిగ్భంధమైంది. భారీ వరదలతో జనాలపై పగబట్టిన కాంగ్రెస్ దుశ్చర్యలను బీఆర్ఎస్తోపాటు, ‘నమస్తే’ వాస్తవాలను పరిశోధించి బయటపెట్టింది. ఇక వరదలతో మూసీ వెంబడి ఉండే పేదలను భయభ్రాంతులకు గురిచేసిన సర్కారు.. ఇకపై ఆ కుట్రలకు తావు లేదని గ్రహించింది. అందుకే మరోసారి జంట జలాశయాల ఎగువన ఉండే పరీవాహక ప్రాంతాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో…అప్రమత్త చర్యలకు దిగింది.
అలర్ట్తో ఆరెంజ్
నగరాన్ని వరదల్లో ముంచిన కాంగ్రెస్ సర్కారు.. వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్తో మేల్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తం పేరిట జలమండలి హడావుడి చర్యలకు దిగింది. అన్ని నిబంధనల ప్రకారమే చేశామంటూ ఇప్పటివరకు చెప్పుకొచ్చిన అధికార యంత్రాంగం.. మొన్నటి మూసీ పరీవాహక వరదల ఘటనను కప్పిపుచ్చుకునేలా బుకాయింపు చర్యలకు 20 గంటల ముందుగానే దిగింది. రాత్రి 8గంటల వరకు సడిసప్పుడు లేకుండా నీళ్లొదిలి అర్ధరాత్రి వరకు నగరాన్ని అతలాకుతలం చేసిన అదే యంత్రాంగం..
ఇప్పుడు ముందస్తు చర్యల్లో భాగంగా రెండు జంట జలాశయాల గేట్లను దశల వారీగా పైకి ఎత్తి 4వేల క్యూసెక్కుల నీటిని వదలుతోంది. అక్కడితో ఆగకుండా ఆగమేఘాల మీద ఎండీ అశోక్ రెడ్డి జంట జలాశయాలను సందర్శించి వరద ఉధృతిని పరిశీలించారు. రిజర్వాయర్ నీటి మట్టంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. దశల వారీగా రిజర్వాయర్ల నుంచి నీటిని వదులుతున్న జలమండలి మధ్యాహ్నం 3గంటల నుంచే 5వేల క్యూసెక్కుల నీటిని వదిలింది.
కానీ ఇటీవల మూసీ పరీవాహక ప్రాంతాన్నీ వరదల్లో కొట్టుకుపోతుందని తెలిసినా… కనీసం ప్రకటన కూడా … జారీ చేయలేదు. ఇప్పుడు ఏకంగా అప్రమత్తం పేరిట ప్రణాళికలను అమలు చేస్తోంది. నిండు కుండలాంటి రెండు జలాశయాల నుంచి ఒకేసారి భారీ వరద నీటిని కిందకు వదిలి మూసీ పరీవాహాక ప్రాంతంలో కృత్రిమ వరదలకు కాంగ్రెస్ కారణమైంది. దీనిపై పెద్ద ఎత్తున్న నిరసన వ్యక్తమైంది. తమపై రేవంత్ సర్కారు సర్కారు చేసిన వరద కుట్రపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం వాతావరణ శాఖ ఇచ్చిన ఆరెంజ్ అలర్ట్తో మేల్కొన్నట్లుగా జలమండలి ఉన్నతాధికారుల నిర్లక్ష్యం బట్టబయలైందనీ సిటీ జనాలు మండిపడుతున్నారు.
నీటి విడుదల వివరాలు (3గంటల నాటికి)
ఉస్మాన్ సాగర్ : హిమయత్ సాగర్
ఎఫ్టీఎల్ : 1790అడుగులు : 1763.50అడుగులు
ప్రస్తుత నీటిమట్టం : 1789.40అడుగులు : 1763.00అడుగులు
ఇన్ఫ్లో : 300 క్యూసెక్కులు : 400క్యూసెక్కులు
అవుట్ ఫ్లో : 2028క్యూసెక్కులు : 2000క్యూసెక్కులు
ఎత్తిన గేట్లు : 3 గేట్లు ఒక్క ఫీట్ : 2గేట్లు 3 ఫీట్లు