ఖైరతాబాద్: కిర్గిస్తాన్‌లో ఎంబీబీఎస్ చదువుతున్న వైద్య విద్యార్థులు సురక్షితంగా ఉన్నారని ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ సంస్థ ఎండీ రామారావు తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది తమ సంస్థ నుంచి వందలాది మంది విద్యార్ధులు వైద్య విద్యనభ్యసించేందుకు కిర్గిస్తాన్‌కు వెళ్తారన్నారు.
ఇటీవల ఈజిప్టు, పాకిస్తాన్‌కు చెందిన విద్యార్థుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలతో భారతీయ వైద్య విద్యార్థులపై ప్రభావం పడిందన్నారు. కొన్ని చానెళ్లు భారతీయ వైద్య విద్యార్థులపై దాడి అంటూ కథనాలు వేయడం వల్ల తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యారన్నారు. భారత రాయబారి విశ్వవిద్యాలయాన్ని సందర్శించి విద్యార్థుల బాగోగులు తెలుసుకున్నారన్నారు. ఈ సమావేశంలో ఇంటర్నేషనల్ హయ్యర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రతినిధులు అజిజా అజిబేకోవా, సికోరా జకీరోవా తదితరులు పాల్గొన్నారు.