సిటీబ్యూరో, సెప్టెంబర్ 3(నమస్తే తెలంగాణ): భారీ వర్షాల నేపథ్యలో తాగునీటి నాణ్యతపై జలమండలి ప్రత్యేక దృష్టి సారించింది. కలుషిత నీటి ముప్పు పొంచి ఉన్న తరుణంలో జలమండలి సరఫరా చేస్తున్న తాగునీటిలో తగిన మోతాదులో క్లోరిన్ ఉండేలా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకు మూడంచెల క్లోరినేషన్ ప్రక్రియను అవలంభిస్తున్నామని ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. నీటి ద్వారా ప్రబలే వ్యాధుల నివారణ, క్లోరిన్ బిల్లలను ఉపయోగించి నీటిని ఎలా శుద్ధి చేసుకోవాలనే విషయంపై కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే జలమండలి ఎండీ అశోక్ రెడ్డి రెండో రోజూ క్షేత్ర స్థాయిలో పర్యటించారు.
శేరిలింగంపల్లి హఫీజ్‌పేట్‌లోని సాయినగర్, యూత్ కాలనీ, మజీద్ బండ, ఇజ్జత్ నగర్ ప్రాంతాలను అధికారులతో కలిసి మంగళవారం సందర్శించారు. తాగునీటి సరఫరాలో రెట్టింపు సంఖ్యలో శాంపిళ్లు సేకరించి పరీక్షించిన తర్వాత సరఫరా చేయాలన్నారు. క్లోరిన్ సైతం తగిన మోతాదులో ఉండాలని, అవసరమైన ప్రాంతాల్లో క్లోరిన్ మాత్రలు పంపిణీ చేయాలన్నారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా ప్రజలకు తాగునీటిని సరఫరా చేయాలన్నారు.మ్యాన్‌హోల్స్ ఉప్పొంగితే వెంటనే పూడిక తీయించాలని, వ్యర్థాలను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. మంచి నీటి పైపు నాలా క్రాసింగ్ వద్ద చెత్త చేరకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.
తాగునీటిని మూడంచెల పద్ధతిలో క్లోరినేషన్ ప్రక్రియ చేసిన తరువాతే ప్రజలకు సరఫరా చేస్తున్నామని ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. ప్రజలు ఇళ్లలో నిల్వ చేసిన నీటిని శుద్ధి చేసుకోవడానికి క్లోరిన్ బిళ్లలు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలు, బస్తీలు, లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటివరకు 8.80 లక్షల క్లోరిన్ బిళ్లలు పంపిణీ చేశామని తెలిపారు. అలాగే కలుషిత నీరు, ఇతర సమస్యలకు జలమండలి కస్టమర్ కేర్ నంబర్ 155313కి ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు నగరంతో పాటు ఓఆర్ఆర్ పరిధిలో వాటర్ లాగింగ్ పాయింట్లు, ఓవర్ ఫ్లో, కలుషిత నీరు తదితర అంశాలను పర్యవేక్షించడానికి ఉన్నత స్థాయి అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఉన్న అధికారులు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, విద్యుత్ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనిచేయనున్నారు.