సిటీబ్యూరో, జూన్ 25 (నమస్తే తెలంగాణ ) : జీహెచ్ఎంసీకి సంబంధించిన ఆస్తులను(GHMC assets) డిజిటలైజేషన్(Digitized) చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి(Mayor Vijayalakshmi) అధికారులను ఆదేశించారు. మంగళవారం మేయర్ ఛాంబర్లో ఎస్టేట్ అదనపు కమిషనర్లతో కలిసి మేయర్ సమీక్షించారు. జీహెచ్ఎంసీ ఆస్తుల ద్వారా ఆదాయ వనరులు పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని మేయర్ ఆదేశాలు జారీ చేశారు.
ఓపెన్ స్థలాలు ఎన్ని స్థలాలు ఉన్నాయి? అవి అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
ఆస్తులను కేటగిరిగా చేసి వాటి వివరాలు అందజేయాలని కోరారు. నెలవారీ అద్దెలు సక్రమంగా వసూలు అవుతున్నాయా? లీజ్ గడువు ముగింపు అయినట్లుగా ముందస్తుగా సంకేతాలు వచ్చే విధంగా ఆన్లైన్లో సరి చేయాలన్నారు. కమ్యూనిటీ భవనాలు ఎన్ని ఉన్నాయి? వాటిని దేనికి ఉపయోగిస్తున్నారో వివరాలను పూర్తి నివేదిక ఇవ్వాలని మేయర్ చెప్పారు.
మోడల్ మార్కెట్, మున్సిపల్ మార్కెట్ గదుల వివరాలు, వినియోగిస్తున్న వాటి వివరాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీకి సంబంధించిన వివిధ రకాల ఆస్తుల వివరాలన్నింటినీ సమగ్ర డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని మేయర్ తెలిపారు. లీజు వివరాలు, ఆస్తులు అన్నింటినీ సిద్ధం చేసుకొని మరోసారి జరిగే సమావేశం వరకు పూర్తి నివేదికతో హాజరు కావాలనిఅధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ శ్రీవాత్సవ తదితరులు పాల్గొన్నారు.