Mayor Vijayalakshmi | ఉప్పల్, సెప్టెంబర్ 5 : ఉప్పల్‌లో గురువారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. నల్లచెరువు ప్రాంతంలోని నిమజ్జన ఏర్పాట్లు, పనుల పరిశీలనకు వచ్చిన మేయర్‌ను పలువురు నేతలు, ఉత్సవ సమితి ప్రతినిధులు నిలదీశారు. నిమజ్జనం సందర్భంగా ఏర్పాట్లు సరిగా చేయడంలేదన్నారు. ఈ క్రమంలో కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకున్నది. గణేశ్ నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు సరిగా లేవంటూ.. బీఆర్ఎస్ నేతలు మేయర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య వాగ్వాదం జరగ్గా.. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సర్దిచెప్పారు. దీంతో గొడవ సద్దుమణిగింది. ఈ క్రమంలో మేయర్ కల్పించుకొని ఎలాంటి వాగ్వాదం చేయవద్దని, ఘర్షణలు పడవద్దని పార్టీ నేతలకు సూచించారు.
ఉప్పల్ ప్రధాన రహదారి సమస్యపై..
భాగ్యనగర్ ఉత్సవ సమితి ఉప్పల్ అసెంబ్లీ కన్వీనర్ రెవెల్లి రాజు ఉప్పల్ ప్రధాన రహదారి సమస్యను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి దృష్టికి తీసుకువెళ్లారు. ఉప్పల్ ప్రధాన రహదారి సమస్య ఇబ్బందిగా ఉందని, నిమజ్జనం సందర్భంగా మరింత జటిలంగా మారుతుందని, సమస్యను సత్వరం పరిష్కరించేవిధంగా రోడ్డు పనులు చేపట్టాలని కోరారు. కాగా, కాంగ్రెస్ నేతలు తనపై దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ రెవెల్లి రాజు ఉప్పల్ పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఉత్సవ సమితి ప్రతినిధులతో కలిసి నిరసన తెలిపారు.
మేయర్ పర్యటన సందర్భంగా ఉప్పల్‌లో నిమజ్జన ఏర్పాట్లు, ప్రధాన రహదారి సమస్యలను మేయర్ దృష్టికి తీసుకువెళ్లామని, ఈ క్రమంలో కొంతమంది తనతో వాగ్వాదానికి దిగారని రాజు పేర్కొన్నారు. అనంతరం కార్పొరేటర్ పిలుస్తున్నారంటూ.. కొందరు చెప్పారని, ఉప్పల్ నిమజ్జన కొలను వద్ద వెళ్లి మాట్లాడుతుండగా, తనపై విక్షణారహితంగా దాడి చేశారన్నారు. పనులు చేయమని అడిగితే కాంగ్రెస్ నేతలు దాడికి పాల్పడ్డారన్నారు.
బాధ్యులపై కేసు నమోదు చేయాలని ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన కాంగ్రెస్ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని, అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే ఉప్పల్ నల్లచెరువును మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్‌రెడ్డి పరిశీలించారు. నిమజ్జనం సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేటర్ల విరాళం
సిటీబ్యూరో, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): వరద బాధితుల సహాయార్థం ఒక్క నెల వేతనాన్ని విరాళమిచ్చేందుకు కార్పొరేటర్లు ముందుకొచ్చారు. సంబంధిత మొత్తాన్ని కార్పొరేటర్లు సీఎం రేవంత్‌రెడ్డిని త్వరలో కలిసి అందజేయనున్నట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు.