బడంగ్‌పేట, జూలై 19: మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం పెట్టి పై చేయి సాధించాలన్న జాతీయ పార్టీలకు చుక్కెదురైంది. ఒకసారి మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్‌పై అవిశ్వాసం పెట్టి నెగ్గలేక పోయారు. మరోసారి శుక్రవారం డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి పై అవిశ్వాస తీర్మానం పెట్టి పంతం నెగ్గించుకోవాలనుకున్నారు. చివరకు రెండు జాతీయ పార్టీలు బొక్క బోర్ల పడ్డాయి. డిప్యూటీ మేయర్ పై పెట్టిన అవిశ్వాసం నెగ్గాలని కాంగ్రెస్, బీజేపీలు సకల ప్రయత్నాలు చేశాయి. అవిశ్వాసం నెగ్గుతామని తొడలు కొట్టి తోక ముడిచారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్లో 46 మంది కార్పొరేటర్లు ఉన్నారు. 31 మంది కార్పొరేటర్లు అవిశ్వాసం పెట్టాలని కలెక్టర్‌కు నోటీస్ ఇచ్చారు. కలెక్టర్ పరిశీలించి 15 రోజుల సమయం ఇచ్చి శుక్రవారం ఉదయం 11గంటలకు అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం 11గంటలకు అవిశ్వాసం పెట్టారు. 11.30 గంటల వరకు కార్పొరేటర్లు ఎవరూ కూడా సమావేశం హాలులోకి రాలేదని ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి తెలిపారు. 11.30 నుంచి 12.30 గంటలకు మరోసారి సమయం ఇచ్చారు. 12 గంటల తర్వాత కాంగ్రెస్ కార్పొరేటర్లు ఏడుగురు, చివరి 15నిమిషాల్లో బీజేపీ కార్పొరేటర్లు 19 మంది హాజరయ్యారు. 31 మంది కార్పొరేటర్లు హాజరు కావాల్సి ఉండగా 26 మంది సభ్యులు సమావేశానికి వచ్చారు.
కోరం లేకపోవడంతో సమావేశం నిర్వహించలేదు. కోరం లేని కారణంగా డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి పై పెట్టిన అవిశ్వాసం వీగిపోయినట్లు ప్రిసైడింగ్ అధికారి సూరజ్ కుమార్ ప్రకటించారు. అవిశ్వాసం పెట్టిన నేపథ్యంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్లో తన పై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోవడానికి అన్ని విధాలుగా రాజకీయ చతురతను ఉపయోగించి తనను గట్టెక్కించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డికి, సహకరించిన కార్పొరేటర్లకు కృతజ్ఞతలు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అండగా ఉన్నంత కాలం ఎవరి కుట్రలు చెల్లవు. నా పనితీరు నచ్చి గతంలో డిప్యూటీ మేయర్‌గా ఎన్నుకున్నారు.
మరోసారి కొంత మంది కార్పొరేటర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానానికి నా వెంట ఉండి సంపూర్ణ మద్దతు ప్రకటించిన ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్లకు ఎప్పుడు రుణపడి ఉంటా. అధికార దాహంతో కాంగ్రెస్, బీజేపీలు కుట్రలు పన్ని డిప్యూటీ మేయర్ పదవి నుంచి తప్పించాలని ప్రయత్నం చేశారు. నాపై ఉన్న నమ్మకంతో అండగా నిల్చి మరోసారి అవకాశం కల్పించి మరింత బాధ్యత పెంచారు. తప్పకుండా నా వంతు బాధ్యతగా అభివృద్ధికి కృషి చేస్తా. ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి సారథ్యంలో మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రజలు సబితా ఇంద్రారెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. సహకరించిన వారందరికి కృతజ్ఞతలు. – తీగల విక్రమ్ రెడ్డి, డిప్యూటీ మేయర్