కీసర, డిసెంబర్ 1: నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్లను అమ్మి కోట్లాది రూపాయలను సొమ్ము చేసుకున్న ఘటన కీసర పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అసలు యాజమానుల పేర్లతో నకిలీ వ్యక్తులను ఏర్పాటు చేసి వారినే యజమానులుగా గుర్తించి కీసరలో ఎస్ఆర్ఓ, డాక్యుమెంటర్ రైటర్ కుమ్మకై అక్రమ రిజిస్ట్రేషన్లు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను కీసర సీఐ ఆంజనేయులు వెల్లడించారు.
నాగారం మున్సిపాల్టీ పరిధి రాంపల్లిలోని మహాలక్ష్మీనగర్లో కొంతమంది వ్యక్తులు ద్వంద్వ రిజిస్ట్రేషన్లు చేసి భూ కభ్జాకు పాల్పడిన్నట్లు కీసర పోలీస్స్టేషన్లో నాంపల్లికి చెందిన వ్యక్తి రమేశ్రావు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కీసర పోలీసులు గత వారం రోజులపాటు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రధాన నిందితులైన మహమ్మద్ ఖాజాఫాషా (రియల్ ఎస్టేట్ బ్రోకర్ మౌలాలి), అతని అనుచరుడు పోలోజు రామచంద్రయ్యలను అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ కలిసి 1990 సంవత్సరానికి ముందు ప్లాట్లు రిజిస్ట్రేషన్లు జరిగి, ఆ తరువాత లావాదేవీలు లేని ప్లాట్లను గుర్తించి నకిలీ పత్రాలను సృష్టించారు.
అసలు ప్లాట్ల యజమానుల పేర్లతో నకిలీ వ్యక్తులను ఏర్పాటు చేసి, వారినే అసలు యజమానులుగా చూపించి కీసరలోని ఎస్ఆర్ఓలో డాక్యుమెంట్ రైటర్, అప్పటి ఎస్ఆర్ఓతో కుమ్మకై అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారు. ఈ నకిలీ డాక్యుమెంట్లను ఉపయోగించి బ్యాంకుల్లో లోన్లు తీసుకోవడం ద్వారా పెద్ద ఎత్తున్న మోసాలకు పాల్పడ్డారు. ఈ కేసుతోపాటు మరికొన్ని ప్లాట్లపై కూడా ఇదే విధంగా మోసాలు జరిగిన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ప్రధాన నిందితులు మహమ్మద్ఖాజా పాషా, పోలోజు రామచంద్రయ్యను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచిన్నట్లు, మిగిలిన నిందితుల కోసం గాలింపు చేపట్టిన్నట్లు కీసర సీఐ ఆంజనేయులు తెలిపారు.