మల్లాపూర్, ఏప్రిల్ 12 : మల్లాపూర్ పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జీపీ రసాయన పరిశ్రమ నుంచి ఒక్కసారిగా మంటలు, దట్టమైన పొగలు ఎగిసిపడటంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలికి చేరుకొని 6 ఫైర్ ఇంజన్లు, 5 జలమండలి వాటర్ ట్యాంకర్ల సాయంతో రాత్రి వరకు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న రాచకొండ సీపీ డీఎస్. చౌహాన్ సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. సీపీతో పాటు డీసీపీలు జానకి, గిరిధర్, ఏసీపీ నరేశ్ రెడ్డి, ఫైర్ అధికారులు, ఇతర సిబ్బంది ఉన్నారు.