సిటీబ్యూరో/సైదాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ ) : జీహెచ్‌ఎంలో నిధుల దోపిడీకి ఇంజినీరింగ్ విభాగం చిరునామాగా మారింది. కాంట్రాక్టర్లతో కొందరు ఇంజినీర్లు చేతులు కలిపి సంస్థ ఖజానాకు కన్నం పెడుతున్నారు. ప్రజాప్రయోజనాలను పక్కన పెట్టి అందినంత దండుకుంటున్నారు. చేయని పనులకు బిల్లులు పెట్టడం… అనుకూల వ్యక్తులకే టెండర్లు అప్పగించడం వంటివి చేయడంలో కొందరు ఇంజినీర్లు సిద్ధహస్తులుగా మారారు. ఇటీవల ఏసీబీ దాడులు, విజిలెన్స్ నివేదికలు ఈ ఇంజినీరింగ్ విభాగంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలకు అద్దం పడుతున్నాయి. అంతేకాకుండా సైదాబాద్ డివిజన్లో సింగరేణి కాలనీ వాంబే క్వార్టర్స్‌లో సీసీ రోడ్డు వేయకుండానే వేసినట్లు బిల్లులు పెట్టి సంస్థ ఖజానాకు రూ. 8.93 లక్షల టోకరా వేసిన ఘటనలో జీహెచ్ఎంసీకి చెందిన ఏఈ అన్సారీని విధుల నుంచి టర్మినెట్ చేశారు.
పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ఏకాంబరంపై సస్పెన్షన్ వేటు వేస్తూ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ నిర్ణయం తీసుకున్నారు. కాగా, డీఎస్ నగర్లో 2021లో జూన్‌లో మొదలు పెట్టిన వరదనీటి కాల్వ (బాక్స్ డ్రెయిన్) విస్తరణ ఆధునీకరణ పనులు చేయకుండా 53 లక్షల రూపాయలను బిల్లులను స్వాహా చేశారు. తాజాగా ఇదే డివిజన్లో మరో అవినీతి తంతు వెలుగులోకి వచ్చింది. డీఎస్ నగర్లోనే వరద నీటి కాల్వ పనుల్లో భాగంగా మూడు చోట్ల పనుల సుమారు 51 లక్షల రూపాయలను బిల్లులను స్వాహా చేశారు.
కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలు, బాక్స్ డ్రెయిన్ నిర్మాణ పనులు చేయకుండా చేసినట్టుగా రికార్డులు సృష్టించి బిల్లులను స్వాహా చేశారని, సమాచార హక్కు చట్టంతో అధికారుల అవినీతి, అక్రమాలను స్థానిక ప్రజాప్రతినిధులు వెలుగులోకి తీసుకువచ్చారు. పనులు పూర్తిచేసినట్లు చూపించి బిల్లు స్వాహా చేసిన నిర్మాణాలను మీడియా సాక్షిగా తేట్లతెల్లం చేశారు. ఇదే విషయాన్ని స్థానిక కార్పొరేటర్ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ కలిసి ఫిర్యాదు చేయగా..స్పందించిన కమిషనర్ విచారణకు ఆదేశించారు.
ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని డీఎస్ నగర్ అంగన్వాడీ కేంద్రం పక్కనే కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం 2021లో ప్రతిపాదనలు చేయగా, ఎటువంటి పనులు చేయకుండానే రూ.10.50 లక్షల బిల్లును, అదే కాలనీలో పబ్లిక్ టాయిలెట్స్‌ను కూల్చివేసిన ప్రదేశంలో కమ్యూనిటీ హాల్ నిర్మించేందుకు అధికారులు 18.60 లక్షల రూపాయలను, ఎస్బీహెచ్ ఆఫీసర్ కాలనీ నుంచి సుబ్రమణ్యంనగర్ కాలనీ మోడల్ మార్కెట్ వరకు 2021-22లో బాక్స్ డ్రెయిన్ ఆధునీకరణ కోసం 22 లక్షలను టెండర్ల ద్వారా దక్కించుకున్న ముగ్గురు కాంట్రాక్టర్లు , అధికారులు కుమ్మకై 51 లక్షల రూపాయల బిల్లులను స్వాహా చేశారు. ఎక్కడ ఎటువంటి నిర్మాణ పనులు చేయకుండానే పనులు చేసినట్లు జీహెచ్ఎంసీ సంతోష్‌నగర్ సర్కిల్ అధికారులు, కాంట్రాక్టర్, క్వాలిటీ కంట్రోల్ అధికారులు కుమ్మకై మూడు పనుల బిల్లులు 51 లక్ష రూపాయలను దారి మళ్లించడం గమనార్హం.
జీహెచ్ఎంసీ సంతోష్‌నగర్ సర్కిల్లో పనిచేసే అధికారులకు అక్రమ సంపాదనకు గనిగా మారింది. మూడు పనుల్లో ఎటువంటి పనులు చేయకుండా బిల్లు స్వాహా చేయడంతో అధికారులు ఆరితేరారు. ఐఎస్ సదన్ డివిజన్లో తవ్విన కొద్దీ అధికారులు, కాంట్రాక్టర్లు చేసిన అవినీతి అక్రమాలు బయటకు వస్తున్నాయని కార్పొరేటర్ జంగం శ్వేత ఆరోపించారు. ఈ అక్రమాలపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ దృష్టికి తీసుకెళ్లామని, అవినీతి అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని ప్రజా ధనం దుర్వినియోగానికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసి కోరామని తెలిపారు. తమ ఫిర్యాదుపై విచారణ జరిపి బాధ్యులైన వారికిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాము సమాచారం హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాలను ఆధారాలతో సహా కమిషనర్‌కు అందజేశామన్నారు. విజిలెన్స్ అధికారుల విచారణలో నిజానిజాలు వెలుగులోకి వస్తాయని, ప్రజా ధనం దుర్వినియోగం చేస్తున్న కాంట్రాక్టర్లపై, అధికారులపై తగిన చర్యలు తీసుకొని.. వారి నుంచి నిధులను రికవరీ చేసి క్రిమినల్ కేసులను నమోదు చేసి విచారణ జరిపించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జీహెచ్ఎంసీలో మెయింటనెన్స్ విభాగానికి సంబంధించిన టెండర్ల అప్పగింతలో కొందరు సీనియర్ ఇంజినీర్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారుతున్నది. ఇటీవల కాలంలో మెయింటనెన్స్, సుందరీకరణ పనుల అప్పగింతలో టెండర్ నిబంధన ఉల్లంఘన జరుగుతున్నదని, టెండర్ నిబంధనలు ఒకరిద్దరు కాంట్రాక్టర్లకు..ఆది కూడా గతంలో టెండర్ దక్కించుకున్న వారికే అనుకూలంగా ఉంటున్నాయని ఇతర కాంట్రాక్టర్ల ప్రధాన ఆరోపణ. వరద నీటి కాలువలు, రహదారుల మరమ్మతులు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, ఇతర నిర్వహణ పనుల్లో భాగంగా జీవో నంబరు 94, జీవో 66ను అమలులో సదరు సీనియర్ ఇంజినీర్లు నిబంధనలను ఉల్లంఘించి పనులు అనుకూల వ్యక్తులకు కట్టబెడుతున్నారని,ఒకటి రెండు రోజుల్లో కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది.
ఇప్పటికే శేరిలింగంపల్లి జోన్లో ఓ కాలనీలో బడా నిర్మాణ సంస్థకు లబ్ధి చేసేందుకు నాలా డైవర్షన్ చేయడంతో కాలనీ వాసులు అభ్యంతరం వ్యక్తం చేశారు.గతంలో ఈ జోన్లో పనిచేసి కూకట్పల్లి వచ్చిన ఇంజినీరు ఒకరు దీని అంతటికి కారణమని ఏసీబీ కార్యాయలంలో కీలక అధికారి ఒకరు ఇప్పటికే విజిలెన్స్ విభాగం దృష్టికి తీసుకువెళ్లడం, అంతర్గత విచారణ సాగుతున్నట్లు ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే కూకట్పల్లి, శేరిలింగంపల్లి జోన్లో ఏడాదిన్నర కాలంగా జరిగిన మెయింటనెన్స్పనులపై విజిలెన్స్‌తో పాటు కమిషనర్ ఆర్వీ కర్ణన్ సైతం ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే సీనియర్ ఇంజినీర్ల అక్రమాలపై ఉద్యోగుల్లో విస్తృత చర్చకు దారి తీసింది.
కేపీహెచ్‌బీ కాలనీ ఆరో ఫేజ్‌లోని మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో సంబంధిత నిర్వాహకులు అడిగినంత ఇవ్వలేదన్న కారణంతో వారిని ముప్పు తిప్పలు పెట్టి చివరకు గడువు ముగిసిన తర్వాత కనీస సమాచారం ఇవ్వకుండా స్పోర్ట్స్కాంప్లెక్స్లోని కంప్యూటర్లు, ఇతర పరికరాలను రోడ్డు మీద పడేసి బయటకు పంపించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదే కూకట్పల్లి జోన్ పరిధిలో ఐదు సర్కిళ్లలో తనకు నచ్చిన కాంట్రాక్టర్లకు పెద్ద పీట వేస్తూ పనులను అప్పగించడం, రిజర్వేషన్ల కోటాలో జరిగే పనులు సైతం అనుకూల వ్యక్తులకే కట్టబెట్టడం, ఈ విషయంలోఎవరైనా నిబంధనలు అంటూ ప్రశ్నిస్తే వారిపై కక్ష కట్టి పనుల బిల్లులు రాకుండా ఆపుతారని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. జోనల్ కమిషనర్‌కు తెలియకుండా వ్యవహారాలను చక్కపెట్టడంలో సదరు ఇంజినీర్‌కు వెన్నతో పెట్టిన విద్య అన్న విమర్శలు లేకపోలేదు. ఇటీవల ఆరోపణలు విస్తృతమైన నేపథ్యంలో సదరు సీనియర్ ఇంజినీర్ ఈ జోన్ నుంచి ఇతర చోటికి వెళ్లేలా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు ఉద్యోగుల్లో చర్చ జరుగుతున్నది.