సిటీబ్యూరో, ఆగస్ట్ 11(నమస్తే తెలంగాణ): అసలే వర్షాకాలం.. ఆపై వరుసగా కుండపోత వర్షాలు.. హైద్రాబాద్ వరదలో మునుగుతోంది. నగరవాసులు రాత్రయితే ఎలా ఉంటుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. ఇలాంటి కీలకసమయంలో విపత్తు నివారణలో కీలకపాత్ర పోషిస్తున్న హైడ్రా మార్షల్స్ ఆందోళన బాట పట్టారు. తమ విధులను బహిష్కరించి నిరసనగళం విప్పారు. దీంతో నగరంలో హైడ్రా సేవలకు అంతరాయం ఏర్పడింది. హైడ్రాలో కీలకబాధ్యతలు పోషించే మార్షల్స్ జీతాలు తగ్గిస్తూ వారి కడుపుమాడ్చే దిశగా రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. వరద నివారణలో వారు చేస్తున్న సేవలను గుర్తించకపోగా.. వారికి ఇచ్చే అత్తెసరుగా ఇస్తున్న జీతాలు కూడా తగ్గించడంతో మార్షల్స్ భగ్గుమన్నారు.
సోమవారం హైడ్రా పార్కింగ్ పాయింట్ వద్ద మార్షల్స్ ఆందోళన బాట పట్టారు. తమ జీతాలు తగ్గించడంపై నిరసన వ్యక్తం చేస్తూ సేవలు నిలిపివేశారు. సంజీవయ్య పార్క్ వద్ద హైడ్రా పార్కింగ్ ఏరియాలో ఆందోళనకు దిగారు. అక్కడి నుంచి బైక్ ర్యాలీగా హైడ్రా ఆఫీసుకు వచ్చి కమిషనర్‌ను కలిశారు. గ్రేటర్ హైదరాబాద్‌లో వర్షాల సమయంలో, ఆ తర్వాత చేపట్టే ఎమర్జెన్సీ సేవలన్నీ పూర్తిగా స్తంభించాయి. నగరంలోని 150 డివిజన్లలో వరద నివారణ చర్యలకు అంతరాయమేర్పడింది. వారంరోజులుగా తమ జీతాల తగ్గింపుపై కమిషనర్ రంగనాథ్‌తో మాట్లాడుతున్నప్పటికీ ఆయన తమను సముదాయించే ప్రయత్నం చేశారని, చివరకు జిఓ ప్రకారమే చెల్లింపులు ఉంటాయని చెప్పడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎం ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత మాట్లాడి సమస్య పరిష్కారం కోసం చూస్తామని చెప్పినప్పటికీ జీతాల తగ్గింపు విషయంలో పెద్దగా స్పందన రాలేదు. కమిషనర్ ప్రయత్నాలు చేసినా ప్రభుత్వం దిగిరాలేదని తెలుస్తోంది.
అసలే వానాకాలం.. అందునా నగరమంతా వరద మయం.. ఇందులో కీలక సేవలందిస్తున్న హైడ్రా మార్షల్స్ విషయంలో సర్కార్ నిర్ణయం వారి ఆగ్రహానికి కారణమైంది. ఎనిమిది గంటల డ్యూటీ అని చెప్పి విధుల్లోకి తీసుకున్నా.. వారి సేవలు ఇరవైనాలుగు గంటలూ కొనసాగుతాయి. నగరంలో హైడ్రా చేపట్టే కూల్చివేత నుంచి విపత్తు నివారణ వరకు అన్నిటా మార్షల్స్ నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటారు. కానీ ఈ మాజీ సైనికుల వేతనాలను తగ్గించడంతో వారు విధులను బహిష్కరించారు. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్‌ను నిర్వహిస్తూ అప్పుడప్పుడు తాముకూడా విపత్తుల పాలయ్యే ధైర్యం ఉన్న ఈ మార్షల్స్ పట్ల హైడ్రా చిన్నచూపు కనబర్చింది. 2020 ఫిబ్రవరిలో జిహెచ్ఎంసిలో ఈవిడిఎం విభాగంలో బాధ్యతలు చేపట్టిన 93 మంది మాజీ సైనికులు నాటినుంచి నేటివరకు నిరంతరాయంగా సేవలందిస్తూనే ఉన్నారు. అప్పట్లో మిలిటరీలో 14 నుంచి 34 సంవత్సరాల అనుభవం ఉన్నవారిని తీసుకున్న నేపథ్యంలో వారి వారి హోదాలను బట్టి పనుల కేటాయింపు జరిగింది. విపత్తుల నిర్వహణలో భాగంగా వారు అందించిన సేవలు ప్రతీ ఒక్కరూ గుర్తు చేసుకుంటారు.
ప్రస్తుతం హైడ్రాలో వెహికల్స్, కంట్రోల్‌రూమ్, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వీరంతా ప్రతీ నెల రూ.29250 జీతం తీసుకుంటున్నారు. వాస్తవానికి ఈ మాజీ సైనికులకు వారివారి స్థాయిని బట్టి డిజిఆర్ పేస్కేల్స్ ప్రకారం రూ.35 నుంచి రూ.45వేల వరకు జీతాలు ఇవ్వాలి. కానీ ఆ ప్రకారం కాకుండా ముప్పైవేల లోపే ఇస్తున్నారు. ప్రతీ ఒక్క సర్కిల్లో ఒక మార్షల్ కింద ఒక వెహికల్, ఒక టెక్నికల్ పర్సన్, ముగ్గురు కార్మికులు పనిచేస్తుండగా విపత్తు నిర్వహణపై తమ బృందాలను ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ పోతున్నారు. మార్షల్స్‌లో మాన్సూన్ టీమ్స్‌తో కలిసి 35 మంది పనిచేస్తుండగా, హైడ్రా కంట్రోల్‌రూమ్‌లో 12 మంది, డిఆర్ఎఫ్కంట్రోల్ రూమ్‌లో 15 మంది, వెహికల్స్‌పై 15 మంది పనిచేస్తున్నారు. ఇంతగా సేవలందిస్తూ ఔట్‌సోర్సింగ్‌గా ఒక ఏజెన్సీ ద్వారా వచ్చిన వీరు గత వారంరోజులుగా తమ బాధను దిగమింగుకుంటున్నారు.
తమ జీతాల తగ్గింపుపై ఆందోళనకుదిగిన మార్షల్స్‌తో హైడ్రా కమిషనర్ రంగనాథ్, అధికారులు చర్చలు జరిపారు. హైడ్రా కార్యాలయం నుంచి వెళ్లిన ప్రపోజల్స్‌లో ఉన్న లోపాల కారణంగానే ఇలా జరిగిందని, పాత నుంచి పనిచేస్తున్న వారికి ఎలాంటి తగ్గింపు ఉండదని రంగనాథ్ వారికి చెప్పారు. అయితే ప్రస్తుతం జిఓ ప్రకారం పేర్కొన్న జీతంతో పాటు జిహెచ్ఎంసి నుంచి 7వేలు కలిపి ఇస్తారని, జీతాల్లో ఎలాంటి తేడా ఉండదని వారిని సముదాయించారు. తాను సిఎంతో మాట్లాడి దీనిపై ప్రత్యేక జిఓ తీసుకొస్తానని, కొత్తవారి విషయంలో జీఓలో పేర్కొన్న జీతమే వర్తిస్తుందని ఆయన మార్షల్స్‌కు చెప్పారు. జీతాలు తగ్గింపు కాకుండా పెంచే ప్రయత్నమే చేస్తామని కమిషనర్ చెప్పారు. దీనికి స్పందించిన హైడ్రా మార్షల్స్ తమకు జీతాలు తగ్గించకుండా చూడాలని, 3 నెలలు వేచిచూస్తామని ఒకవేళ అప్పటికీ జరగకపోతే తమ కార్యాచరణను ప్రకటిస్తామని కమిషనర్‌కు తెలిపారు.