మేడ్చల్, జూలై 3(నమస్తే తెలంగాణ): ‘మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి నియోజకవర్గంలోని ప్రభుత్వ భూములన్నీ ఆక్రమణలకు గురువుతున్నాయి.. ప్రభుత్వ భూమి ఎక్కడ ఉంటే అక్కడ ఆక్రమణలు జరుగుతున్నాయి.. శ్మశాన వాటిక స్థలాలనూ వదలేట్లదు. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడంలేదు’ అని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు.
ఈ మేరకు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ప్రజలతో కలిసి వచ్చి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరికి గురువారం ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలోని అల్వాల్‌లోని ప్రభుత్వ సర్వే నంబర్లలో ఉన్న జోన్నబండ, లయోలా కాలేజీ సమీపంలో బీహెచ్ఎల్ కాలనీ, వినాయక్‌నగర్ డివిజన్లోని వినోబా నగర్, మచ్చ బోల్లారంలోని హిందూ శ్మశాన వాటిక, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల మధ్య ఉన్న 844 సర్వే నంబర్ ఐఎన్ నగర్లో సుమారు 55 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యక్రాంతమవుతున్న దృష్ట్యా ప్రభుత్వ భూములను కాపాడాలని కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.
ప్రభుత్వ భూములను రక్షించాల్సిందిపోయి అక్రమార్కులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కబ్జాలకు గురైన ప్రభుత్వ భూములను కాపాడి ప్రజలకు ఉపయోగపడే విధంగా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, లైబ్రరీలు, నవోదయ స్కూల్, డిగ్రీ కళాశాల, సబ్స్టేషన్ల ఏర్పాటుకు భూములను కేటాయించాలన్నారు. అర్బన్ హెల్త్ సెంటర్లు, లైబ్రరీలకు ఫైనాన్స్ కమిషన్ నిధులు కేటాయించి ఉన్నా.. ప్రభుత్వ భూములు ఇప్పటి వరకు అధికారులు కేటాయించలేదన్నారు. ఐఎన్ నగర్లో ఉన్న 55 ఎకరాల ప్రభుత్వ భూమిలో హద్దులు గుర్తించినట్లయితే నవోదయ స్కూల్‌ను ఏర్పాటు చేసుకోవచ్చన్నారు.
ఎక్కడ బ్లూ షీట్లుసర్కారు భూములన్నీ కబ్జా ఉంటే అక్కడ ప్రభుత్వ భూమి కబ్జాలకు గురవుతన్నట్లేనన్నారు. మచ్చబొల్లారంలోని హిందూ శ్మశాన వాటికలు అన్యక్రాంతం కాకుండా చూడాలన్నారు. ముస్లిం, క్రిస్టియన్ల శ్మశాన వాటికలకు స్థలం కేటాయించాలన్నారు. ప్రభుత్వ భూములను పరిరక్షించే బాధ్యతను ఉన్నతాధికారులు తీసుకోవాలన్నారు. ఇచ్చిన వినతి పత్రంపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారని, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్లు శాంతి శ్రీనివాస్‌రెడ్డి, సునీత రాముయాదవ్, నాయకులు బద్దం పరుశురాంరెడ్డి, అనిల్కిశోర్గౌడ్ ఉన్నారు.