హిమాయత్‌నగర్, మార్చి 25: ఆర్థిక ఇబ్బందులతో తరుచూ భార్యాభర్తల మధ్య వివాదంతో మనస్తాపం చెందిన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం నారాయణగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. హిమాయత్‌నగర్‌లోని ఉర్దూ గల్లీలో ఆర్.మహేష్, శిరీష (53) దంపతులు నివాసం ఉంటున్నారు. 32 ఏండ్ల కిత్రం వివాహం కాగా వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.
భర్త మహేష్ ఉద్యోగం మానేసి ఇంట్లో ఉండటంతో వారికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. దీంతో మహేష్, శిరీషల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఏం పని చేయకుండా ఇంట్లో ఉంటే ఏట్లా? ఏదైనా పని చేయాలని మంగళవారం రాత్రి మహేష్, శిరీష దంపతులు గొడవ పడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన శిరీష బెడ్రూంలోకి వెళ్లి చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మరో బెడ్రూంలో కుమారుడు విగ్నేష్, భర్త మహేష్ పడుకున్నారు.
అర్ధరాత్రి దాటినా తరువాత శిరీష నిద్రించేందుకు వెళ్లిన గది తెరిచేందుకు ప్రయత్నించగా గడియపెట్టి ఉంది. పలుమార్లు పిలిచినా లోపలి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో డోర్‌లాక్‌ను ఓపెన్ చేసి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతూ కన్పించింది. దీంతో ఆమె భర్త, కుమారుడు 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది ఆమెను పరీక్షించి, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పోస్టుమార్టం అనంతరం మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలు శిరీష కుమారుడు విగ్నేష్ ఫిర్యాదు మేరకు ఎస్సై నాగరాజు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.