సిటీబ్యూరో, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఏపీ నుంచి కారులో నగరానికి తరలిస్తున్న గంజాయి, డ్రగ్స్‌ను పట్టుకునేందుకు యత్నించిన ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులపై గంజాయి వ్యాపారులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. అయినప్పటికీ అప్రమత్తతతో వ్యవహరించిన పోలీసులు నిందితులను వెంటాడి పెద్ద ఈంబర్పేట ఓఆర్ఆర్ 11వ నెంబర్ ఎగ్జిట్ వద్ద పట్టుకుని అరెస్టు చేయగా, ఒక మహిళ తప్పించుకుని పారిపోయినట్లు అధికారులు తెలిపారు. ఆబ్కారీ అధికారుల కథనం ప్రకారం… రాజమండ్రికి చెందిన గోబెరు వెంకట చైతన్య అలియాస్ ఫేక్ రెజ్వన్, నడిమిటి మమత భార్యాభర్తలు.
వీరిద్దరూ తరచూ రాజమండ్రి నుంచి గంజాయి తీసుకొని వచ్చి హైదరాబాద్‌లో అమ్మకాలు సాగిస్తారు. బెంగళూరు నుంచి కూడా తన స్నేహితుల ద్వారా డ్రగ్స్ తెప్పించి నగరంలో విక్రయిస్తారు. అనంతరం కారులో రాజమండ్రికి తిరిగి వెళ్లిపోతారు. ఈ మేరకు సమాచారం అందుకున్న ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు భార్యాభర్తలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో శనివారం వారు నగరానికి వస్తున్నట్లు తెలుసుకున్న ఎస్టీఎఫ్ బృందం పెద్ద అంబర్‌పేట వద్ద తనిఖీలు చేపట్టి నిందితులను పట్టుకునేందుకు యత్నించారు. దీంతో భార్యాభర్తలిద్దరూ పోలీసులపై తిరగబడి, కత్తులతో దాడి చేసి, కారుతో పరారయ్యేందుకు యత్నించారు.
దీంతో అప్రమత్తమైన పోలీసులు నిందితులను వెంటాడి, పెద్ద అంబర్‌పేట ఓఆర్ఆర్ 11వ నెంబర్ ఎగ్జిట్ వద్ద వెంకట చైతన్య, కారు డ్రైవర్ రవిందర్‌లను పట్టుకుని అరెస్టు చేయగా, మమత తప్పించుకుని పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 4.495కిలోల గంజాయి, 0.65గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌తోపాటు కారు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని, సీజ్ చేశారు. కాగా నిందితులు చేసిన దాడిలో ఆబ్కారీ సిబ్బందికి స్వల్ప గాయాలైనట్లు అధికారులు తెలిపారు. నిందితులపై గతంలో కూడా గంజాయి, డ్రగ్స్ రవాణా చేసిన నేరాలపై నగరంలో పలు కేసులు నమోదై ఉన్నట్లు ఆబ్కారీ పోలీసులు తెలిపారు. గంజాయి వ్యాపారులను ఛేజ్ చేసి పట్టుకున్న ఎస్టీఎఫ్ సీఐ భిక్షారెడ్డి, ఎస్సై బాలరాజు, సంధ్య, ఇతర సిబ్బందిని ఆబ్కారీ ఈడీ షానవాజ్ ఖాసిం, ఈఎస్ కె.ప్రదీప్‌రావులు అభినందించారు.
ఢిల్లీ, గోవా తదితర ప్రాంతాల నుంచి అక్రమంగా నగరానికి తరలిస్తున్న 50 ఎన్డీపీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే….గోవా, ఢిలీ నుంచి అక్రమంగా నగరానికి నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యం తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు ఎస్టీఎఫ్ పోలీసులు శనివారం శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా వేర్వేరు ప్రాంతాల్లో కారులో తరలిస్తున్న 50ఎన్డీపీ మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్టీఎఫ్ ఈఎస్ నంద్యాల అంజిరెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును సరూర్‌నగర్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.