OYO Rooms | సిటీబ్యూరో, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): ఓయో రూమ్ కేంద్రంగా గంజాయి విక్రయాలు జరుపుతున్న వ్యక్తిని శంషాబాద్ డీటీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. ఓయో రూంలో నిందితుడి వద్ద నుంచి రూ.లక్ష విలువ చేసే 4కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. శంషాబాద్ ఈఎస్ కృష్ణప్రియ కథనం ప్రకారం…జమ్మూకశ్మీర్‌కు చెందిన పవన్‌కుమార్, సచిన్ కుమార్ నగరానికి వలస వచ్చి.. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
అయితే వ్యసనాలకు అలవాటు పడిన వీరు.. డబ్బుల కోసం గంజాయి విక్రయించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో పోలీసులకు అనుమానం రాకుండా ఉండేందుకు గండిపేటలోని టీఎన్జీవో కాలనీలో ఉన్న ఓయో రూంలోని 205వ నంబర్ గదిలో గంజాయి పెట్టి అమ్మకాలు సాగిస్తున్నారు. సమాచారం అందుకున్న శంషాబాద్ డీటీఎఫ్ పోలీసులు ఓయో రూంపై దాడులు జరిపి పవన్‌కుమార్‌ను అరెస్టు చేశారు. మరో నిందితుడు సచిన్ పరారీలో ఉన్నాడు.