హిమాయత్ నగర్, జూన్ 7: చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ పోలీసుల నిర్బంధంలో ఉన్న మావోయిస్టు నేతలను తక్షణమే కోర్టులో హాజరుపరచాలని తెలంగాణ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ జి.లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.నారాయణరావు డిమాండ్ చేశారు. హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వార మాట్లాడుతూ.. మావోయిస్టు నాయకులైన బండి ప్రకాశ్, నేషనల్ పార్క్ కార్యదర్శి దిలీప్, మద్దెడ్ ఏరియా కార్యదర్శి రామన్నతో పాటు సునీత, మున్నా, మహేశ్, భాస్కర్లతో పాటు మరో 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, వారిని అరెస్ట్ చేసి నట్లు పోలీసులు చూపించడం లేదన్నారు. వారి ప్రాణాలకు పోలీసులు ఎలాంటి హాని చేయకుండా కోర్టులో హాజరు పరచాలని డిమాండ్ చేశారు.
గత 18 నెలల నుంచి ఆపరేషన్ కగార్ పేరుతో వందలాది మంది ఆదివాసులు,ఉద్యమకారులను కేంద్ర ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్లు చేసి హత్య చేసిందని ఆరోపించారు. ఆదివాసీ ప్రజలు జీవించలేని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. బూటకపు ఎన్ కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చే న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు చట్టాలను, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే స్థితి దాటిపోయిందని చంపాలనుకున్న వారిని ఏ ప్రజాస్వామ్యం నిలువరించే స్థితిలో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలతో పోలీసులకు చిక్కిన మావోయిస్టు నాయకులను ఎన్ కౌంటర్ పేరుతో హత్యమార్చడం రాజ్యాంగానికి వ్యతిరేకమన్నారు. దేశంలోని ప్రజాస్వామిక వాదులు, రాజకీయ పార్టీల నేతలు ముక్త కంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. మావోయిస్టులపై జరుగుతున్న కఠిన చర్యలు, ఎన్ కౌంటర్లను నిలిపి వేసి శాంతి చర్చలు జరిపేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.