సిటీబ్యూరో, జూలై 18 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీలో ఆర్టిస్టిక్ పెయింటింగ్ పనుల టెండర్ ప్రక్రియలో ఎన్నో మలుపులు, మరెన్నో మడతలు ఉన్నాయి..పేరుకు గ్రేటర్‌లోని ఫ్లై ఓవర్లను అత్యంత సుందరంగా, సంప్రదాయం ఉట్టిపడేలా, కళ్లకు ఇంపుగా అనిపించేలా కలర్‌ఫుల్ చిత్రాలతో ఆర్టిస్టిక్ పెయింటింగ్ పనులు చేపడుతున్నారు. చార్మినార్, ఎల్బీనగర్, కూకట్పల్లి, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి జోన్లో ఆర్టిస్టిక్ పెయింటింగ్ పనులు జరిగాయి. దాదాపు ఏడాది కాలంలో ఒక్కొక్కటికీ రూ.కోటిన్నర లోపుతో పదుల సంఖ్యలో రూ.50కోట్ల మేర పనులు జరిగాయి.
ఇందులో 90 శాతం మేర ఒకే సంస్థకు పనులు దక్కడం.. ప్రస్తుతం దశల వారీగా పిలుస్తున్న టెండర్లకు సదరు ఈకో సంస్థకే దక్కుతుండడం పట్ల వివాస్పదమవుతున్నది. అధికారులు చెబుతున్నది ప్రధానంగా పనిచేసిన అనుభవం (ఎలిజిబులిటీ) నిబంధననే ప్రామాణికంగా తీసుకుంటున్నారే తప్ప.. టెండర్ దశలో ఎక్కువ మంది పాల్గొనే విధంగా చొరవ చూపడం లేదు. జీవో 94 కారణంగా సామాన్యులు కాంట్రాక్టర్లుగా పనిచేసే అవకాశాన్ని కోల్పోతున్నారని జీవో 66ను తీసుకువచ్చారు. దీని ప్రకారం గత అనుభవం అవసరం లేని పనులను కూడా కొత్త వారికి అప్పగించవచ్చు.
కానీ అధికారులు మాత్రం అనుభవం లేని వ్యక్తులతో ప్రాజెక్టు అప్పగిస్తే మొదటికే మోసం వస్తుందన్న సాకును బలంగా చూపుతున్నారు. ఈకో సంస్థకు ధీటుగా బేగంపేట గ్రీన్‌ల్యాండ్స్ ఫ్లై ఓవర్ పనులు మరో సంస్థ దక్కించుకున్న సందర్భాలు ఉన్నాయి. గతంలో ఖైరతాబాద్ జోనల్ పరిధిలో మూడు సార్లు సదరు ఈ సంస్థ టెండర్లలో అర్హత సాధించలేదు. ఇదే క్రమంలోనే ఇటీవల ఎల్బీనగర్ జోన్లో ఇటీవల ఆర్టిస్టిక్ పెయింటింగ్ టెండర్లను పిలవగా…ఎక్కువ మంది పాల్గొనకపోవడంతో టెండర్‌ను రద్దు చేశారు.
ఈ రద్దు వెనుక అనుమానాలు లేకపోలేదు. ముఖ్యంగా ఖైరతాబాద్, కూకట్పల్లి, చార్మినార్, శేరిలింగంపల్లిలో మాత్రం పనిచేసిన అనుభవం మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటుండడం, కొందరికే 94 జీవోను అనుకూలంగా మారుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా ఒక్కో జోన్లో ఒక్కో రీతిలో ఈ టెండర్ల అప్పగింత ప్రక్రియ జరుగుతుండడం ప్రస్తుతం వివాదానికి కారణమవుతున్నది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి అన్నీ తానై చక్రం తిప్పుతున్నారని ప్రచారం సాగుతున్నది. మొత్తంగా వివాదాస్పదమవుతున్న ఆర్టిస్టిక్ పెయింటింగ్ పనుల టెండర్ల ప్రక్రియపై కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆరా తీసినట్లు తెలిసింది. ఇదే సమయంలో కొందరు కాంట్రాక్టర్లు విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేయనున్నట్లు అసోసియేషన్ నేతలు చెబుతున్నారు.