Handling Charges | సిటీబ్యూరో, మార్చి 3 (నమస్తే తెలంగాణ) : కొత్త వాహనాలు కొంటున్న వారికి పలు షోరూంల నిర్వాహకులు కుచ్చుటోపీ పెడుతున్నారు. వాహనం కొనుగోలు చేసిన వారి నుంచి హ్యాండ్లింగ్ చార్జిలు, ఆర్టీఏ చార్జిల పేరుతో అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు. కొన్ని షోరూంలలో 10 వేల నుంచి 15 వేల వరకు ఏకంగా బిల్లులోనే చూపిస్తున్నారు. ఇది నిజమేననుకుని చాలా మంది వాహనదారులు డబ్బులు చెల్లిస్తున్నారు. తీరా ఆ డబ్బులు చెల్లించిన వివరాలు ఇన్ వాయిస్‌లో ఎక్కడా ఉండదు.
ఇలాంటి సంఘటనలతో మోసపోతున్న కొందరు ఆర్టీఏ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో తక్షణం స్పందించిన రవాణా శాఖ 3 షోరూం నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇదే కాకుండా.. మరికొన్ని వాహన షోరూంలు డిస్కౌంట్ పేరుతో వాహనాలను విక్రయిస్తున్నాయి. దీంతో వాహనదారులు డిస్కౌంట్ మినహాయించగా ఉండే ధరపైనే లైఫ్ ట్యాక్స్ చెల్లిస్తామని చెబుతున్నారు. అది నిబంధనలకు విరుద్ధం కావడంతో వాహనదారులకు రవాణా శాఖ అధికారుల మధ్య వాగ్వాదాలకు దారి తీస్తున్నది. ఈ సంఘటనల నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న షోరూంలపై చర్యలకు ఆర్టీఏ ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది.
ముందే తెలుసుకోండి..!
వాహన కొనుగోలు సమయంలో షోరూంలు ఇచ్చిన డిస్కౌంట్‌కు కూడా వినియోగదారుడు పన్ను చెల్లించాల్సిందే. పూర్తి పన్ను చెల్లిస్తేనే ఆ వాహనం రిజిస్టేష్రన్ ప్రక్రియ పూర్తవుతుంది. కాదంటే రిజిస్టేష్రన్‌కు బ్రేకులు పడతాయి. షోరూంలు ఎంత డిస్కౌంట్ ఇచ్చినా ట్యాక్స్ కట్టేటప్పుడు మాత్రం వాస్తవ ధర ఆధారంగా లెక్కిస్తారని ఆర్టీఏ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
డిస్కౌంట్ ధరతో తమకు సంబంధం లేదని చెబుతున్నారు. ఇటీవల 3.34 కోట్ల విలువ జేసే మెర్సడేస్ బెంజ్‌కు ఓ షోరూం 30 లక్షల డిస్కౌంట్‌తో ఓ వినియోగదారుడికి విక్రయించింది. దీంతో అతడు 3.4 కోట్లకు కారు కొనుగోలు చేశాడు. కానీ ఆర్టీఏ కార్యాలయంలో ట్యాక్స్ కట్టేటప్పుడు మాత్రం 3.34 కోట్లకు లెక్కిస్తామని అధికారులు స్పష్టం చేశారు. రవాణా శాఖ నిబంధనల ప్రకారం వాహనం అసలు ధరపైనే పూర్తి పన్ను చెల్లించాల్సిందే. ధర లో డిస్కౌంట్ అనేది కేవలం కంపెనీ ఇచ్చిన ఆఫర్ మాత్రమే. డిస్కౌంట్ వ్యత్యాసం పన్ను మినహాయింపుకు వర్తించదని అధికారులు చెబుతున్నారు.
డిస్కౌంట్ వేరు.. పన్ను వేరు..!
ఉదాహరణకు ఒక వాహనం ధర రూ.20 లక్షలు ఉంటే కంపెనీ డిస్కౌంట్ పేరుతో కస్టమర్‌కు 10 లక్షలకు ఇచ్చినా.. ఇన్వాయిస్ బిల్లు 10 లక్షలతో తీసుకొచ్చినా.. ఆ వాహన ధర ఆర్టీఏ డాటాబేస్‌లో ఉంటుంది. ఆ 20 లక్షలపైన 18 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. డిస్కౌంట్ అనేది పన్ను మినహాయింపునకు కాదనేది కస్టమర్లు అవగాహన చేసుకోవాలని ఆర్టీఏ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
కొందరూ తనపై రెండు వాహనాలున్నప్పటికీ ట్యాక్సీ మరో 2 శాతం అధికంగా చెల్లించాల్సి ఉంటుందనే విషయం కూడా తెలుసుకోకుండా కొనుగోలు చేసి తీరా రిజిస్టేష్రన్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. షోరూం వాళ్లు కూడా ఈ విషయం చెప్పకుండా వాహనం విక్రయించడమే పరమావధిగా పెట్టుకుంటున్నారు. విషయం తెలిస్తే తమ కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్టేష్రన్ చేయించేవాళ్లమని వాహనదారులు చెబుతున్నారంటూ అధికారులు పేర్కొన్నారు.
షోరూంల రిజిస్టేష్రన్ అథరైజేషన్ సస్పెండ్ చేస్తాం
రవాణా శాఖ నిబంధనలు పాటించకుండా వాహనాలను విక్రయిస్తున్న షోరూం నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటాం. వాహనదారులకు వాహనాలను విక్రయించేటప్పుడు ఆర్టీఏ చార్జెజ్, హ్యాండ్లింగ్ ధరల పేరిట వాహనదారుల నుంచి ఛార్జీలు వసూలు చేస్తున్నట్టు ఫిర్యాదులు అందాయి. అటువంటి షో రూం నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా అదనపు రుసుం వాహనదారుల నుంచి వసూలు చేయకూడదు. గోడౌన్ నుంచి షోరూంకు వాహనం తీసుకొచ్చామని, సర్వీసింగ్ చేయించామని అదనంగా డబ్బులు వసూలు చేయకూడదు. అలాంటి చర్యలకు పాల్పడితే షోరూంల రిజిస్టేష్రన్ అథరైజేషన్ సస్పెండ్ చేస్తాం.
– మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్, రవాణా శాఖ విజిలెస్స్ జాయింట్ కమిషనర్.