బంజారాహిల్స్, మార్చి 14: అనారోగ్యంతో మృతి చెందిన మాజీ మంత్రి కే.విజయరామారావు భౌతిక కాయానికి మంగళవారం పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. విజయరామారావు పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లోని ఆయన స్వగృహంలో ఉంచారు. మంగళవారం ఉదయం నుంచే ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు విజయరామారావు ఇంటికి వచ్చి నివాళులర్పించారు. రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్, ఈటల రాజేందర్, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ సీవీ.ఆనంద్, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, కార్పొరేటర్లు మన్నె కవితారెడ్డి, విజయారెడ్డి, ఫిలింనగర్ సొసైటీ కార్యదర్శి కాజా సూర్యనారాయణ, బీఆర్ఎస్ నేత మన్నె గోవర్ధన్‌రెడ్డి తదితరులు విజయరామారావు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. వారితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. విజయరామారావు కుమారుడు శ్రీనివాస్ కల్యాణ్, కుమార్తె అన్నపూర్ణ తదితరులను పరామర్శించారు.

మాజీ మంత్రి విజయరామారావు అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అమెరికాలో ఉన్న ఆయన కుమారుడు ప్రసాద్ రావు మంగళవారం రాత్రి నగరానికి చేరుకున్నాడు. బుధవారం ఉదయం 10గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో విజయ రామారావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.