GHMC | సిటీబ్యూరో, ఫిబ్రవరి 17(నమస్తే తెలంగాణ): గ్రేటర్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగం పెరుగుతున్నది. అత్యధిక డిమాండ్ ఉన్నప్పుడు విద్యుత్ సమస్యలు పెరిగే అవకాశముంది. ట్రాన్స్ఫార్మర్ల మరమ్మత్తులు, మీటర్లు కాలిపోవడం, లైన్లలో నిర్వహణలోపం తదితర అంశాలు ప్రధానంగా కరెంట్ సరఫరాపై ప్రభావం చూపుతాయి. నిరంతర విద్యుత్ సరఫరా చేయాలంటూ టీజీఎస్పీ డీసీఎల్ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి సిబ్బందికి సూచిస్తూ సమ్మర్ యాక్షన్‌ప్లాన్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని చెబుతున్నా.. ప్లాన్‌కు సంబంధించిన పనులు ఇంకా క్షేత్రస్థాయిలో పూర్తి కాలేదు.
మొదట్లో జనవరి చివరి వరకు పూర్తి చేస్తామని, ఆ తర్వాత ఫిబ్రవరి 10కి పూర్తి చేస్తామని లక్ష్యం నిర్దేశించుకున్నా ఇంకా పనులలో పురోగతి కనిపించడం లేదు. ప్రధానంగా ఫీడర్ల నిర్వహణ చాలా సమస్యాత్మకంగా మారుతున్నదని, ఓవర్‌లోడ్ కారణంగా ఇప్పటినుంచే వినియోగదారుల నుంచి ఫిర్యాదులు పెరుగుతున్నాయని సిబ్బంది చెబుతున్నారు. గత ఏడాది ఏయే ప్రాంతాల్లో ఎక్కువగా సమస్యలు వచ్చాయో విశ్లేషించుకోవడంతో పాటు వినియోగదారుల ఫిర్యాదులపై కూడా సమీక్షలు నిర్వహించాల్సి ఉంది. మరోవైపు ఈసారి కనెక్షన్లు కూడా పెరగడం, గృహజ్యోతి పథకం వంటి వాటి వల్ల లోడ్ పెరిగి సమస్యలు పెరిగే అవకాశం ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు.
గతేడాది సెంట్రల్లో అధిక ఫిర్యాదులు..!
హైదరాబాద్ పరిధిలో పది సర్కిళ్లున్నాయి. గతేడాది ఎక్కువగా ట్రాన్స్ఫార్మర్లు పాడవడం, ప్యూజులు పోవడం, ఎల్టీ లైన్, సర్వీస్వైర్ లోపాలకు సంబంధించిన ఫిర్యాదులొచ్చాయి. హైదరాబాద్ సెంట్రల్లో అత్యధికంగా 1.54 లక్షల ఫిర్యాదులు రాగా, సికింద్రాబాద్ నుంచి 30,506, మేడ్చల్ నుంచి 24,296, హైదరాబాద్ సౌత్ నుంచి 21,652, బంజారా హిల్స్ సర్కిల్లో 17,581, సైబర్‌సిటీ నుంచి 15,864 మంది ఫిర్యాదు చేశారు. ట్రాన్స్ఫార్మర్లు పాడైతే కొన్నిటికి రిపేర్లు సాధ్యం కాదు. కాబట్టి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలి. డిస్కంలో ట్రాన్స్ఫార్మర్ల కొరత ఉన్నట్లు సిబ్బంది చెబుతున్నారు. వేసవి డిమాండ్ నేపథ్యంలో విద్యుత్ పరికరాల సరఫరా పెంచాలని వారు కోరుతున్నారు. క్షేత్రస్థాయిలో వినియోగదారులు సిబ్బందిపైనే ఎక్కువగా ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది. ప్రధాన కార్యాలయం నుంచి తమకు సపోర్ట్ లేకపోతే ఈసారి కరెంట్ సమస్యలను తీర్చడం కష్టమేనని వారు పేర్కొన్నారు. మరోవైపు డిమాండ్‌కు సరిపడా కరెంట్ ఉన్నప్పుడు లో వోల్టేజీ సమస్యలుండవని, కానీ గ్రేటర్లో పలు చోట్ల లో వోల్టేజీతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ వేసవిలో ఈ సమస్య తీవ్రంగా ఉండే అవకాశముందని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు.
ఫోన్లు కలవడం లేదు..!
విద్యుత్ పోయిందంటూ కరెంట్ ఆఫీసుకు ఫోన్‌చేస్తే కలవడం లేదని, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే సిబ్బంది రావడానికి సమయం పడుతున్నదని పలు సర్కిళ్లలోని వినియోగదారులు చెబుతున్నారు. ఎక్కువగా స్థానికంగా ఫ్యూజ్ ఆఫ్ కాల్ సిబ్బందికి కాల్స్ చేస్తే కలవడం లేదన్న ఫిర్యాదులే ఉన్నాయి. శివారు ప్రాంతాల్లో ఈ సమస్య అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. నగరం పరిధిలోని సంగారెడ్డి, బంజారాహిల్స్, హబ్సిగూడ, సికింద్రాబాద్ సర్కిళ్లలో ఎక్కువగా బ్రేక్ డౌన్లు ఉంటున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. వీటి విషయంలో సిబ్బంది అప్రమత్తంగా లేకపోతే సమస్య తీవ్రమవుతుంది. మరోవైపు విద్యుత్ లైన్ల నిర్వహణ , మరమ్మతులు సరిగా చేయకపోవడంతో అప్రకటిత కోతలు కూడా పెరుగుతాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొన్నారు. ఇక ఓవర్‌లోడ్‌తో గ్రేటర్లో ప్రతీరోజూ కాలిపోతున్న మీటర్ల సంఖ్య పెరుగుతోంది. ప్రధానంగా బంజారాహిల్స్, సైబర్‌సిటీ పరిధిలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. దీనికి అధికలోడ్ కారణంగా సిబ్బంది చెబుతున్నారు.
వేసవికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేశాం: టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖి
వేసవిలో వినియోగదారులకు విద్యుత్ సమస్యలు ఉండకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఈ సారి జనవరి చివరి నుంచే విద్యుత్ సరఫరా డిమాండ్, విద్యుత్ వినియోగం పెరిగింది. రాబోయే రోజుల్లో సాధారణ వినియోగం కంటే 25 శాతం డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ముందస్తుగా ప్రణాళికలు రూపొందించుకుని పనులు పూర్తిచేస్తున్నాం. అవసరమైన చోట ఫీడర్లు ఏర్పాటు చేశాం. వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన , అంతరాయాలు లేని విద్యుత్‌ను అందిస్తాం.