బేగంపేట్, అక్టోబర్ 22: సంచలనం సృష్టించిన ముత్యాలమ్మ దేవాలయ విధ్వంస ఘటనకు నిరసనగా పలు సంస్థలు ఈ నెల 19న చేపట్టిన ప్రదర్శనల్లో పోలీసులపై దాడులకు పాల్పడ్డ ఐదుగురు వ్యక్తులను మార్కెట్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ అమ్మ వారి ఆలయంలో చోటు చేసుకున్న విధ్వంసానికి నిరసనగా ఈ నెల 19న వివిధ హిందూ సంస్థలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌ను పురస్కరించుకుని బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులపై ఆందోళనకారులు వాటర్ బాటిళ్లు, రాళ్లు, చెప్పులు విసిరారు. ఈ ఘటనకు సంబంధించి మార్కెట్ ఎస్ఐ మమత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ అల్లర్లకు సంబంధించి ఆయా పరిసరాల్లో సీసీ ఫుటేజీలు, వీడియో రికార్డింగుల ఆధారంగా మార్కెట్ పోలీసులు బీజేపీ, బజరంగ్ దళ్, వీహెచ్‌పీకి చెందిన నాయకుల ప్రమేయాన్ని గుర్తించి కేసులు నమోదు చేశారు. ఇందులో బీజేపీకి చెందిన కొంతం నరేష్, సహా వివిధ సంస్థలకు చెందిన ప్రశాంత్, కిరణ్, వంశ తిలక్, శరత్ ఠాకూర్, రాంరెడ్డి, కిషన్, శివరామ్, సాయి ప్రకాశ్, సంతోశ్, రాజేశ్, శ్రీనివాస్, శరత్, సుభాశ్, అంజి, ప్రవీణ్ తదితరులపై కేసులు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా మోహన్, రాజేశ్, ఎల్లేశ్, ఆయుశ్ రాజ్, చింతకాయల శివాజీ, జ్ఞాన సుందర్‌లను రిమాండ్‌కు తరలించారు. కాగా, ఘటనకు బాధ్యులైన మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.