బంజారాహిల్స్,జూన్ 24: జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్‌లో 8 నెలలుగా రోడ్డు పనులు పెండింగ్‌లో ఉండడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని ఖైరతాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి అన్నారు. సమస్యలపై సమరం కార్యక్రమంలో భాగంగా బుధవారం మన్నె ఆయన స్థానిక బీఆర్ఎస్ నేతలతో కలిసి ఇందిరానగర్‌లో పర్యటించారు. స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
కొన్ని వీధుల్లో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని, కొత్త రోడ్లకు నిధులు మంజూరైనా పనులు మాత్రం పూర్తి చేయడం లేదని స్థానికులు ఆరోపించారు. దీంతో పాటు బస్తీలో తాగునీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, నల్లాలు సమయానికి వదలడం లేదని పేర్కొన్నారు. దీంతో సంబంధిత జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులకు ఫోన్లు చేసిన మన్నె గోవర్ధన్‌రెడ్డి వెంటనే పనులు పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు శంకర్, బాబుగౌడ్, చంద్రమౌళి. సత్తన్న, వెంకటేశ్, శివకుమార్ పాల్గొన్నారు.